Adani Group: గౌతమ్ అదానీ స్టాక్స్‌లో పతనం వరుసగా ఆరో రోజు (గురువారం) కూడా కొనసాగింది. రూ. 20,000 కోట్ల FPOని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెనక్కు తీసుకున్న తర్వాత, నెగెటివ్‌ సెంటిమెంట్‌ ఇంకా పెరిగింది. ఇంటర్నేషనల్‌ బ్యాంకర్లు క్రెడిట్‌ సూయిస్‌, సిటీ గ్రూప్‌ అదానీ బాండ్లకు విలువ లేదని చెప్పడం (జీరో వాల్యూ) కూడా గందరగోళాన్ని మరింత పెంచింది. 


మొత్తంగా చూస్తే, గత వారం (జనవరి 24, 2023) షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ దాడి నుంచి మొదలుకుని ఇప్పటి వరకు, మొత్తంగా అదానీ గ్రూప్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టం $100 బిలియన్లకు పెరిగింది.


మంగళవారంతో ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినప్పటికీ, US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ విమర్శలు తీవ్రతరం కావడంతో స్టాక్స్‌లో పతనం ఆగలేదు. ఆ కారణంగా, FPOకు బుధవారం అదానీ స్వస్తి పలికారు. 


ఆసియాలోనూ నం.1 పోస్ట్‌ లేదు
ఈ కొన్ని రోజుల్లోనే గ్రూప్‌ విలువ $100 బిలియన్లు తగ్గడంతో, దానికి అనుగుణంగా అదానీ వ్యక్తిగత (నికర ఆస్తులు) విలువ కూడా క్షీణించింది. ఫలితంగా, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అనే బిరుదును కూడా గౌతమ్‌ అదానీ కోల్పోయారు. 


అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్‌ ధర ఇవాళ (గురువారం, 02 ఫిబ్రవరి 2023) హైయ్యర్‌ సైడ్‌లోనే ప్రారభమైనా, ఆ తర్వాత పతనమైన 10% పడిపోయింది. గ్రూప్‌లోని ఇతర కంపెనీలు - అదానీ పోర్ట్స్ అండ్‌ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission) తలో 10% చొప్పున క్షీణించాయి. అదానీ పవర్ ‍‌(Adani Power), అదానీ విల్మార్ ‍‌(Adani Wilmar) ఒక్కొక్కటి 5% పతనమయ్యాయి.


గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో, మొత్తం 10 లిస్టెడ్ అదానీ కంపెనీల మార్కెట్ విలువ మూడింట ఒక వంతుకు పైగా ‍‌(33% పైగా) తగ్గింది. 


ఫోర్బ్స్ (Forbes) జాబితా ప్రకారం... అదానీ ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 16వ స్థానంలో ఉన్నారు, గత వారం మూడో స్థానంలో ఉన్నారు. అంటే.. కేవలం వారం రోజుల్లోనే 3 నుంచి 16 నంబర్‌కు పడిపోయారు.


అప్పులపై RBI ఆరా
అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాల వివరాలను తమకు పంపాలని అన్ని బ్యాంకులను సెంట్రల్‌ బ్యాంక్‌ (RBI) కోరినట్లు రాయిటర్స్‌ ఒక రిపోర్ట్ రిలీజ్‌ చేసింది. 


CLSA అంచనా ప్రకారం.. 2022 మార్చి వరకు, అదానీ గ్రూప్ కంపెనీలకు ఉన్న 2 లక్షల కోట్ల రూపాయల ($24.53 బిలియన్లు) రుణంలో ఇండియన్‌ బ్యాంకులే 40% ఇచ్చాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.