Credit Suisse - Adani: ఆర్థిక సేవలను అందించే అంతర్జాతీయ సంస్థ క్రెడిట్ సూయిస్, గౌతమ్ అదానీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీలు జారీ చేసే బాండ్లను అంగీకరించబోమని ప్రకటించింది. అంటే, ఈ బాండ్లను గ్యారెంటీగా పెట్టుకుని క్రెడిట్ సూయిస్ మార్జిన్ లోన్లు ఇవ్వదు. క్రెడిట్ సూయిస్ తీసుకున్న నిర్ణయంతో, బుధవారం బాండ్ & ఈక్విటీ మార్కెట్లలో సెగలు పుట్టించింది. బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో అదానీ కౌంటర్లు $23 బిలియన్లు నష్టపోయాయి. ఇవాళ (గురువారం, 02 ఫిబ్రవరి 2023) కూడా ఆ సెగ తగిలింది.
అయితే, అదానీ గ్రూప్‌నకు సంబంధించిన ఎలాంటి రుణాల మీదా హోల్డ్‌కో (హోల్డింగ్ కంపెనీ) గ్యారెంటీలు లేవని అదానీకి సన్నిహితంగా మెలిగే కొందరు వ్యక్తులు వెల్లడించారు. ACC- అంబుజా కొనుగోలు కోసం తీసుకున్న రుణాలు ఈ కంపెనీలు ఆర్జించే ఆదాయంతో ముడిపడి ఉంటాయి కానీ వాటి షేర్ల ధరలతో కాదని చెప్పారు. అంటే, ACC- అంబుజాకు క్రెడిట్ సూయిస్ స్టేట్‌మెంట్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అదానీ బాండ్లకు జీరో లెండింగ్ వాల్యూ
ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ (FPO) ద్వారా 2.5 బిలియన్ డాలర్ల వాటా విక్రయం పూర్తి చేసిన ఒక రోజు తర్వాత క్రెడిట్ సూయిస్ నిర్ణయం వెలుగులోకి వచ్చింది. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (Adani Electricity Mumbai Ltd) జారీ చేసిన బాండ్లకు జీరో లెండింగ్ విలువను (విలువ లేదు) క్రెడిట్ సూయిస్ కేటాయించింది. అందువల్లే, బుధవారం మధ్యాహ్నం ట్రేడింగ్‌లో సెషన్‌లో అదానీ గ్రూప్ షేర్లలో భారీ క్షీణత కనిపించింది.
హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన 2023 జనవరి 24వ తేదీ నుంచి బుధవారం (01 ఫిబ్రవరి 2023) వరకు, అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ విలువ $90 బిలియన్లు పడిపోయింది. దీంతో ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అనే టైటిల్‌ను కూడా గౌతమ్ అదానీ కోల్పోయారు.
రేటింగ్ బాగుంది, యూరోపియన్ బ్యాంకులతో ఇబ్బంది లేదు
అదానీ కంపెనీల బాండ్లకు క్రెడిట్ సూయిస్ జీరో లెండింగ్ వాల్యూను (zero lending value) ఇచ్చినా, ఇతర బ్యాంకులు మాత్రం అదానీ బాండ్స్ మీద రుణాలు ఇవ్వడం కొనసాగిస్తున్నాయి. రెండుకు పైగా యూరోపియన్ ప్రైవేట్ బ్యాంకులు అదానీ బాండ్ల ప్రస్తుత స్థాయిని యథాతథంగా కొనసాగిస్తున్నాయి. వాటిలో ఒక బ్యాంక్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ డాలర్ బాండ్స్‌కు 75% నుంచి 80% వరకు రుణాన్ని అందిస్తోంది.
2024లో మెచ్యూర్ అయ్యే అదానీ గ్రీన్ ఎనర్జీ డాలర్ బాండ్స్ (Adani Green Energy’s dollar bonds) డాలర్‌తో పోలిస్తే 76.83 సెంట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 2027లో మెచ్యూర్ అయ్యే $750 మిలియన్ల APSEZ బాండ్లు డాలర్‌తో పోలిస్తే 81.53 సెంట్లు పెరిగాయి. $1 బిలియన్ విలువైన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ పేపర్ (బాండ్) డాలర్‌తో పోలిస్తే 75.34 సెంట్లు వద్ద ట్రేడవుతోంది.
అదానీ గ్రీన్ బాండ్స్‌కు మూడీస్ (Moody’s) Ba3 రేటింగ్ ఇవ్వగా, APSEZ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై పేపర్లను Baa3గా రేట్ చేసింది.
బాండ్ మార్కెట్ మొత్తం లీవరేజ్ మీద పని చేస్తుంది. ఉదాహరణకు, BB రేట్ ఉన్న బాండ్లకు ప్రైవేట్ బ్యాంకులు 50-80% వరకు రుణాలు అందిస్తాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.