నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారం ఇంకా సద్దుమణగక ముందే కృష్ణా జిల్లాలో నేతల మధ్య విభేదాలు బట్టబయలు అయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీలో నేతల మధ్య ముసలం తీవ్రస్థాయికి చేరింది. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశించి అదే పార్టీకి చెందిన నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు అసహన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా వైకుంఠపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వైఎస్ఆర్ సీపీ నేతలు పాల్గొనగా.. వారు ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


ఎమ్మెల్యేలు కొడాలి నానీ, వల్లభనేని వంశీని ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ప్రకారం.. యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. ఆ కొడాలి నానీ ఏడో తరగతి తప్పిన వెధవ అని వ్యాఖ్యలు చేశారు. ‘‘వాడు ఎంతసేపూ సినిమాలంటాడు. ఏ సినిమాలోనైనా ఏం ఉంటుంది. సినిమా మొత్తం హీరో కంటే విలన్‌కే ఎక్కువ క్రేజ్‌ ఉంటుంది. చివరికి క్లైమాక్స్‌లో హీరో చేతిలో చెంపదెబ్బ తినడం రొటీన్. వాడి వల్ల గుడివాడ నియోజకవర్గానికి ఏం ఉపయోగం? అసలు వంశీ, నానీ ఏ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించారు?’’ అని యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు. వల్లభనేని వంశీ గురించి మరో నేత దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ.. వంశీ ఆగడాలను తామే ప్రశ్నించామని, అందుకే తమకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చిందని మాట్లాడారు. మీడియాను మేనేజ్ చేయడంలో వంశీ దిట్ట అంటూ యార్లగడ్డ వెంకట్రావ్ వ్యాఖ్యలు చేశారు.


గుంటూరు జిల్లాలో జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్న సందర్బంలో ఈ ఇద్దరు వైఎస్ఆర్ సీపీ నేతల మధ్య జరిగిన సంభాషణ అంటూ పలువురు దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.