YSRCP One Capital :  ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశం మరోసారి కాక రేపుతోంది. ఢిల్లీలో సీఎం జగన్ ప్రకటన చేసిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడా విశాఖ రాజధాని అనే మాట మాట్లాడుతున్నారు కానీ.. మూడు రాజధానులు అనడం లేదు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని కూడా అనడం లేదు. విశాఖ రాజధాని అంటున్నారు. కర్నూలు న్యాయరాజధాని గురించి ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వం ఒక్క రాజధాని..అది కూడా విశాఖే అని ఫిక్స్ అయిందన్న వాదన వినిపిస్తోంది. 


విశాఖ రాజధానిని ఒక్క సారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ సానుభూతి పరులు


విశాఖలో నిర్వహించబోతున్న గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు పారిశ్రామితవేత్తల్ని ఆహ్వానించేందుకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన దౌత్యవేత్తల సమావేశంలో సీఎం జగన్ విశాఖ రాజధాని కాబోతోందని ప్రకటించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ సానుభూతి పరులు విశాఖ రాజధానిని హైలెట్ చేశారు. ఎవరూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా వాడలేదు. దీంతో ఇక వైఎస్ఆర్‌సీపీ ఒకే రాజధాని అన్న భావనకు వచ్చిందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభించారు.  ఇటీవలి కాలంలో వైఎస్ఆర్‌సీపిక చెందిన ఉత్తరాంధ్ర మంత్రులు విశాఖ ఒక్కటే రాజధాని అనే ప్రకటనలు చేస్తున్నారు.  రాజధానిగా విశాఖ లేకపోతే తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఉత్తరాంధ్ర మంత్రులు  ప్రకటనలు చేస్తున్నారు. వారి ప్రకటనలను వైసీపీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ ఖండించలేదు. అంటే.. వ్యూహాత్మకంగానే ఆ ప్రకటనలు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 
 
న్యాయపరంగా సాధ్యమా ?  
 
రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు  తేల్చి చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. ప్రస్తుతం రాజధాని అమరావతి మాత్రమే. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో ఉది. ఇది అత్యంత క్లిష్టమైన కేసుగా న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం అనుకోగానే రాజధాని మార్పు చేయలేరు. ఎందుకంటే రాజధాని పేరుతో 29వేల మంది నుంచి ప్రభుత్వమే భూములు సమీకరణ చేసింది. వారికి అనేక వాగ్దానాలు చేసింది. అవి నేరవేర్చకపోతే నష్టపరిహారం ఇస్తామని ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం రాజధానిని మార్చాంటే.. ఈ సమస్యలను అధిగమించాలి. సుప్రీంకోర్టులో దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చిన తర్వాతనే రాజధానిని మార్చగలరా లేదా అన్నది తేలుతుంది. 


సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న కొడాలి నాని !


సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని మాజీ మంత్రి కొడాలి నాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒక వేళ రాకపోతే కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఫైనల్. ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే విభజన  చట్టంలో మూడు రాజధానులు అని మార్చకపోతే కేంద్రం కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు విభజన చట్టాలన్ని వైఎస్ఆర్‌సీపీ ఒత్తిడితో మారిస్తే చాలా అంశాలు మార్చాలన్న డిమాండ్లు వినిపించవచ్చు. పైగా అమరావతిని గత ప్రభుత్వం రాజధానిగా నిర్ణయించింది. అదీ కూడా ఏకగ్రీవంగా. ఇప్పుడు సీఎం గా ఉన్న జగన్ అసెంబ్లీలో అంగీకార ప్రకటన కూడా చేశారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అందుకే మూడు రాజధానులు అనే  మాట పక్కన  పెట్టి.. విశాఖ రాజధాని అనే  వాదన తెస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.