Adani Group Investment In Renewable Energy: పునరుత్పాదక ఇంధనం మీద ఎక్కువ ఫోకస్‌ పెట్టిన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్, ఈ రంగంలో అతి పెద్ద పెట్టుబడికి ప్లాన్‌ వేసింది. సుమారు రూ.2.3 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం రోడ్‌మ్యాప్‌ తయారు చేసింది. ఈ డబ్బును సౌర & పవన విద్యుత్‌ సహా పునరుత్పాదక ఇంధనాల తయారీ కోసం ఖర్చు చేయబోతోంది. మొత్తం రూ.2.3 లక్షల కోట్లను 2030 సంవత్సరం వరకు, దఫదఫాలుగా చొప్పిస్తుంది. 


అదానీ గ్రూప్‌ ప్లాన్‌లో భాగంగా, దేశంలోనే అతి పెద్ద పునరుత్పాదక ఇంధన సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ సుమారు రూ. 1.5 లక్షల కోట్లు వెచ్చించనుంది. గుజరాత్‌లోని ఖావ్డా, కచ్‌లో సౌరశక్తి & పవన శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 2 గిగావాట్ల (GW) నుంచి 30 గిగావాట్లకు పెంచడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తుంది.


అదానీ న్యూ ఇండస్ట్రీస్ తరపున రూ.50 వేల కోట్లు
అదానీ గ్రూప్‌ సీనియర్ అధికారి చెప్పిన ప్రకారం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన 'అదానీ న్యూ ఇండస్ట్రీస్', దేశంలోని వివిధ ప్రదేశాల్లో 6 నుంచి 7 గిగావాట్ల ప్రాజెక్టుల కోసం సుమారు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. గుజరాత్‌లోని ముంద్రాలో ఉన్న సోలార్ సెల్, విండ్ టర్బైన్ ఫ్లాంట్‌ సామర్థ్యాన్ని విస్తరించేందుకు అదానీ న్యూ ఇండస్ట్రీస్ దాదాపు రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది.


45 గిగావాట్లకు కెపాసిటీ పెంపు
ప్రస్తుతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 10,934 MW (10.93 GW) సామర్థ్యంతో బిజినెస్‌ చేస్తోంది. 2030 నాటికి 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఖవ్డాలోని 2,000 మెగావాట్ల (2 గిగావాట్ల) సామర్థ్యం గల ప్లాంట్‌ను విస్తరిస్తామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో దానిని 4 గిగావాట్లకు పెంచుతామని కంపెనీ ఎండీ వినీత్ జైన్ చెప్పారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 5 గిగావాట్‌ల చొప్పున సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్తామని అన్నారు. ఆ విధంగా, 30 గిగావాట్ల సామర్థ్యంతో, ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ఖవ్డాలో రూపుదిద్దుకుంటుంది. ఇందులో 26 గిగావాట్లు సౌర విద్యుత్‌, 4 గిగావాట్ల పవన విద్యుత్‌ ఉంటుంది.


పారిస్‌ కంటే ఐదు రెట్ల ఎక్కువ విస్తీర్ణం
ఖవ్డా ప్లాంట్ దాదాపు 538 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది, ఇది పారిస్ కంటే దాదాపు 5 రెట్లు పెద్దది. ఉత్పత్తి గరిష్ట సామర్థ్యానికి చేరుకున్నప్పుడు, ఇక్కడి నుంచి 81 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది చాలా పెద్ద పరిమాణం. ఈ శక్తితో బెల్జియం, చిలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల ఇంధన అవసరాలను ఈ ఫ్లాంట్‌ ఒక్కటే ఒంటరిగా తీర్చగలదు. ఖవ్డాతో పాటు రాజస్థాన్, తమిళనాడులోనూ అదానీ గ్రూప్ ఇలాంటి ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది.


ముంద్రాలో సెల్‌, మాడ్యూల్‌ తయారీ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తిని పెంచి.. దేశంలోని పునరుత్పాదక ఇంధన సంస్థల అవసరాలు తీర్చడంతో పాటు ఎగుమతులు చేసేందుకు 'అదానీ న్యూ ఇండస్ట్రీస్' భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ముంద్రా ఫ్లాంట్‌ సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 4 గిగావాట్ల నుంచి 2026-27 నాటికి 10 గిగావాట్లకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వినీత్‌ జైన్ చెప్పారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి