FDI flows Into India Fall In 2023: మరో 23 సంవత్సరాల్లో, అంటే 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ‍‌(India as a developed economy) మార్చాలన్నది ప్రధాని మోదీ కల & లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం మోదీ 3.0 ప్రభుత్వ హయాంలో కీలక నిర్ణయాలు ఉంటాయని నిపుణలు అంచనా వేస్తున్నారు. అయితే.. భారతదేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDIs) మోదీ కల సాకారాన్ని ఆలస్యం చేసేలా ఉన్నాయి. ఇటీవలి నివేదిక ప్రకారం, గత ఏడాది భారత్‌లోకి వచ్చిన ఎఫ్‌డీఐలు అతి భారీగా దాదాపు 43 శాతం తగ్గాయి.


కొత్త రిపోర్ట్‌ రిలీజ్‌ చేసిన UNCTAD
యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (UNCTAD) సంస్థ, వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ రిపోర్ట్ 2024 (World Investment Report 2024) పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం, 2023లో భారతదేశానికి మొత్తం 28.163 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 2022లో ఈ మొత్తం 49.38 బిలియన్ డాలర్లు. 2022తో పోలిస్తే 2023లో ఎఫ్‌డీఐలు 42.97 శాతం తగ్గాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. 


2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా నిలవాలన్న భారతదేశ కలను నిజం చేసే అత్యంత కీలక అంశాల్లో విదేశీ పెట్టుబడులు కూడా ఒకటి.


ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ & దేశ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పోకడలను UNCTAD ప్రపంచ పెట్టుబడి నివేదిక వివరిస్తుంది. అభివృద్ధికి తోడ్పడే చర్యలకు సంబంధించిన సూచనలు కూడా ఆ నివేదికలో ఉన్నాయి. ఈ రిపోర్ట్‌ ప్రకారం, ఎఫ్‌డీర్‌ఐ ఇన్‌ఫ్లో పరంగా, 2022లో భారత్‌ 8వ స్థానంలో ఉంది, 2023లో 15వ స్థానానికి పడిపోయింది. అయితే... గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్స్‌, అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఫైనాన్స్ డీల్స్‌లో ఎఫ్‌డీఐ పరంగా భారతదేశం టాప్ 5 దేశాల్లో ఉంది.


2020లో భారత్‌లోకి 64 బిలియన్ డాలర్లు
UNCTAD నివేదిక ప్రకారం, 2020 సంవత్సరంలో కరోనా ప్రబలినప్పటికీ భారతదేశంలోకి 64 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత, మహమ్మారి సృష్టించిన ప్రతికూలతల కారణంగా 2021లో 44.763 బిలియన్‌ డాలర్లకు, 2022లో 49.38 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. 2023లో భారతదేశం నుంచి 13.341 బిలియన్‌ డాలర్లు బయటకు వెళ్లాయి.


టాప్ 20 ఆర్థిక వ్యవస్థలను ‍‌(Top 20 economies) పరిగణనలోకి తీసుకుంటే, 2023లో ఫ్రాన్స్ గరిష్ట స్థాయిలో FDIల క్షీణతను చవిచూసింది. ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, భారత్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2 శాతం క్షీణించి 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.


అభివృద్ధి చెందుతున్న దేశాల్లో (Developing Countries) ఎఫ్‌డీఐల ఇన్‌ఫ్లో 7 శాతం తగ్గి 867 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2023లో, ఆయా దేశాల్లో పెట్టుబడి విధానానికి సంబంధించి తీసుకున్న చర్యల్లో 86 శాతం నిర్ణయాలు గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు నచ్చలేదు, ఈ కారణంగా పెట్టుబడులు తగ్గాయి. కఠినమైన రుణ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ప్రాజెక్టులకు చెందిన రుణ ఒప్పందాలు (Finance deals) 26 శాతం క్షీణించాయి.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి