Jyotirlingas are Connected to Zodiac: నవగ్రహాల సంచారం ఆధారంగా ఓ వ్యక్తి జాతకాన్ని అంచనా వేస్తారు. జాతకంలో గ్రహాల సంచారం అనుకూల దిశలో లేనప్పుడు..పంచభూతాధిపతి అయిన పరమేశ్వరుడిని పూజించాలని సూచిస్తారు పండితులు. గ్రహాలకు మూలం సూర్యుడు అయితే..సూర్యుడికి అధిదేవత ఈశ్వరుడు. మిగిలిన 8 గ్రహాలు కూడా పరమేశ్వరుడి అధీనంలోనే ఉంటాయి. అందుకే శివాలయాల సందర్శన ద్వారా కొంత ప్రశాంతత లభిస్తుందంటారు. పంచారామాలు, పంచభూత లింగాలు, జ్యోతిర్లింగాలు ఇలా వివిధ రకాల శైవ క్షేత్రాలున్నాయి. వీటన్నింటినీ దర్శించుకోవడం శుభప్రదం. అయితే ప్రతి భక్తుడు తన జీవితకాలంలో 12 జ్యోతిర్లింగాలన దర్శించుకోవాలని భావిస్తారు. అన్నీ దర్శించుకోవడం వీలుకాకుంటే మీ రాశిప్రకారం సందర్శించాల్సిన జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శిస్తే మంచిదంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.  


మీ రాశి ప్రకారం ఏ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 


మేష రాశి (Aries)


మేష రాశివారికి కుజుడు స్వగృహంలో ఉంటాడు. పదకొండో రాశ్యాధిపతి శని. అందుకే శ్రీరాముడు పూజించిన తమిళనాడులో ఉన్న రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి.  


శ్లోకం
సుత్రామ పర్ణీ జరరాషి యోగే నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యే
శ్రీరామ చంద్రేన సమర్పితం త రామేశ్వరాఖ్యం నియతం నమామి!!


వృషభ రాశి (Taurus) 


ఈ రాశివారి స్వగృహంలో శుక్రుడు ఉంటాడు..అందుకే వీరు శ్రీ కృష్ణుడు పూజించిన గుజరాత్ ఉన్న సోమనాథుడిని దర్శించుకోవాలి. ఈ రాశివారు జన్మనక్షత్రం సమయంలో సోమనాథుడి సన్నిధిలో రుద్రాభిషేకం చేయించుకున్నా, దర్శించుకున్నా మంచి ఫలితాలు పొందుతారు. 
 
శ్లోకం
సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం
భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే !!


మిథున రాశి (Gemini)


ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి జాతకంలో ఉండే గ్రహదోషాల పరిహారార్థం గుజరాత్ నాగేశ్వరంలో ఉన్న నాగేశ్వర లింగాన్ని దర్శించుకోవాలి. ముఖ్యంగా అష్టమ శని, ఏల్నాటి శని, అర్థాష్టమ శని సంచరిస్తున్న సమయంలో నాగేశ్వర లింగాన్ని దర్శించుకోవడం శుభప్రదం. 


శ్లోకం
సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై
సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే !!


కర్కాటక రాశి (Cancer) 


కర్కాటక రాశి చంద్రుడికి స్వగృహం. ఈ రాశివారు తమ జన్మ నక్షత్రం రోజు మధ్యప్రదేశ్ లో కొలువైన ఓంకారేశ్వరుడిని దర్శించుకోవాలి. 


శ్లోకం
కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ
సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే !!


సింహ రాశి (Leo)
 
సింహ రాశివారికి సూర్యుడు అధిపతి. వీరు మహారాష్ట్రలో ఉన్న శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. 
 
శ్లోకం
ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం
వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే !!


కన్యా రాశి (Virgo)


కన్యా రాశివారికి అధిపతి బుధుడు. వీరు శ్రీశైల జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే అన్ని రకాల గ్రహదోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.  


శ్లోకం
శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం
తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం  


తులా రాశి (Libra) 
 
శుక్రుడు అధిపతి అయిన తులా రాశివారు పూజించాల్సిన జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. 


శ్లోకం
ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం
అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం !!


వృశ్చిక రాశి (Scorpio) 
 
కుజుడు అధిపతి అయిన వృశ్చిక రాశివారు దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగం ఝార్ఖండ్ లో ఉన్న వైద్యనాథేశ్వరం. 


శ్లోకం
పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం
నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి!!


ధనుస్సు రాశి  (Sagittarius)
 
ధనస్సు రాశి బృహస్పతికి స్వగృహం. ఈ రాశివారుకు కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. కాశీ క్షేత్రాన్ని దర్శించుకుని వస్తే శని, గురు గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. 


శ్లోకం
సానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం 
వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే !!



మకర రాశి (Capricorn) 
 
ఈ రాశి శనికి స్వగృహం. మహారాష్ట్ర భీమ శంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే ఈ రాశివారికి సకల గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. 
 
శ్లోకం
యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ
సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి !!


కుంభ రాశి  (Aquarius) 
 
కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ రాశివారు ఉత్తరాఖండ్ లో ఉన్న కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే గ్రహపీడలు, శత్రుబాధల నుంచి విముక్తి కలుగుతుంది. 
 
శ్లోకం
మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష 
మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే !!


మీన రాశి (Pisces) 
 
మీన రాశికి అధిపతి బృహస్పతి. పంచభూతాల్లో జలానికి సంకేతం అయిన ఈ రాశివారు..ఎప్పుడూ నీటిమధ్యలో ఉండే త్ర్యయంబకేశ్వరుడిని దర్శించుకోవాలి. ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది  
 
శ్లోకం
సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే
యద్దర్శనాత్ పాతకమాశునాశం ప్రయాతి తంత్ర్యంబక మీశమీడే


Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!