పెట్రోల్, డీజిల్ కార్ల వినియోగంతో కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా భూతాపం రోజు రోజుకు పెరిగిపోతున్నది. అటు విదేశాల నుంచి పెట్రో ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజు రోజుకు అధికం అవుతున్నాయి. ఓవైపు ధరల పెరుగుదల ఇబ్బందులు, మరోవైపు కర్బన ఉద్గారాల నివారణ కోసం ప్రపంచ దేశాలు ఇతర ఇంధన ఉత్పత్తుల మీద ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగానే సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్, ఫ్లెక్సీ ఫ్యూయెల్, బయో ఫ్యూయల్ తో నడిచే వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నాయి.
తొలి ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారును ఆవిష్కరించిన నితిన్ గడ్కరీ
ఈ నేపథ్యంలోనే రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిన ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. టయోటా కంపెనీ ఇథనాల్ తో నడిచే ఇన్నోవా హైక్రాస్ ప్రోటోటైప్ హైబ్రిడ్ కారును రూపొందించింది. ఈ లేటెస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ ఇంజిన్ E100 గ్రేడ్ ఇథనాల్‌తో అంటే 100 శాతం ఇథనాల్ తో నడిచేలా తయారు చేసింది. ఇందులో సెల్ఫ్ ఛార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీని పొందుపర్చారు. దీంతో ఈవీ మోడ్‌లోనూ ఈ వాహనం నడుస్తుంది. ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ ను పొందుపర్చారు. ఓవైపు ఇథనాల్, మరోవైపు ఛార్జింగ్ తో ఈ వాహనం రన్ అవుతుంది.
ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ అంటే ఏంటి?
ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ అనేది ఇంజిన్‌ను ఇథనాల్ పెట్రోల్ మిశ్రమంతో పనిచేసేలా చేస్తుంది. దీని కారణంగా కర్బన ఉద్గారాలు చాలా తక్కువగా విడుదలయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 ఇంధనం అందుబాటులో ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ అత్యధిక ఇథనాల్ మిశ్రమాన్ని 48 శాతం వరకు మిక్స్ చేస్తోంది. భారతదేశంలోని అనేక సంస్థలు తమ వాహనాలను E20 ఇంధన టెక్నాలజీతో ప్రారంభించాయి. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ అనేది తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఎందుకంటే బయోవేస్ట్ నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇక ఈ కారులో ఇథనాల్ ద్వారా 40 శాతం వరకు పవర్ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ పెట్రోల్ రూ.109 పలుకుతుండగా, లీటర్ ఇథనాల్ సుమారు రూ.60 మాత్రమే. అంటే పెట్రోల్ కంటే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఉండగా, ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటవుతున్నాయి. కానీ, ఇథనాల్ బంకులు ఎక్కడా లేవు. పెట్రోలియం కంపెనీలు ఇక నుంచి ఇథనాల్ పంపులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని నితిన్ గడ్కరీ ఇప్పటికే సూచించారు.
ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి?
మరోవైపు భారత్‌లోని పలు కార్ల తయారీ సంస్థలు ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యుయల్ వెహికల్స్ తయారీ వైపు ఫోకస్ పెట్టాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, హోండా కార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ కార్లు ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తాయనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు.
Read Also: వావ్ అనిపిస్తున్న కొత్త టాటా నెక్సాన్ డిజైన్ - లుక్ టీజ్ చేసిన కంపెనీ!