Petrol Car Conversion In To CNG Car Guide: మన దేశంలో పెట్రోల్ & డీజిల్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయి, నెలనెలా వేల రూపాయల బిల్లుతో సంపాదనకు చిల్లు పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో, ప్రజలు కాస్త చవకగా ప్రయాణించగల మార్గం CNG. CNG అనేది డబ్బును ఆదా చేసే ఇంధన ఎంపిక. మీకు పెట్రోల్ కారు ఉంటే, పెట్రోల్‌ బిల్లును మీరు భరించలేకపోతుంటే, మీ కారులో CNG కిట్‌ ఇన్‌స్టాల్ చేయవచ్చు. దీంతో, మీ పెట్రోల్ కారును CNG కారుగా మార్చి, పెట్రోల్‌ బిల్లు నుంచి బయటపడవచ్చు. 

Continues below advertisement


మొట్టమొదట చేయాల్సిన పని ఇదీ...
మీ పెట్రోల్ కారును CNG కారుగా మార్చాలనుకున్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని - మీ పెట్రోల్‌ కారు CNG కిట్‌ ఇన్‌స్టలేషన్‌కు సరిగ్గా సరిపోతుందా లేదా అని చెక్‌ చేయడం. మీ పెట్రోల్ కారు పాతది అయితే దానికి CNG కిట్ దొరకడం కష్టం. దీని కోసం మీరు సరైన పరిశోధన చేసి, సమాచారం పొందాలి. మీ కారులో CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేయగల 'గుర్తింపు పొందిన డీలర్‌'ను సంప్రదించాలి. 


CNGకి మార్చడానికి ప్రభుత్వం నుంచి అనుమతి
ఇది సెకండ్‌ స్టెప్‌. మీ పెట్రోలు కారును CNG లోకి మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందడం తప్పనిసరి. మీ కారులో ఉపయోగించే ఇంధన రకం మారుతుంది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. 


మంచి CNG కిట్‌ కోసం సెర్చ్‌ చేయండి 
మీ కారును చెక్‌ చేయించి లైసెన్స్ పొందిన తర్వాత, మూడో స్టెప్‌లో, మంచి CND కిట్‌ కోసం సెర్చ్‌ చేయండి. నాణ్యమైన CNG కిట్ కోసం కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే దీర్ఘకాలంలో మీ పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుంది. మీరు ఈ కిట్‌ను అధికారిక డీలర్ నుంచి మాత్రమే కొనుగోలు చేయండి. ఈ CNG కిట్ ఒరిజినలా, కాదా అని కూడా చెక్‌ చేయండి.


CNG కిట్ ఇన్‌స్టాలేషన్‌
మీ ప్రయత్నంలో చివరి అడుగు CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం. మంచి CNG కిట్ కొనుగోలు చేసిన తర్వాత, దానిని మీరే ఇన్‌స్టాల్‌ చేయడానికి ప్రయత్నించవద్దు. మంచి మెకానిక్ సాయం తీసుకోండి. ఈ ప్రక్రియలో భద్రతతో పాటు మీ కారు మెకానికల్‌ మాడ్యులేషన్ చాలా ఉంటుంది. దాదాపుగా, CNG కిట్ కొనుగోలు చేసే చోటే మీకు ఇన్‌స్టాలేషన్‌ సర్వీస్‌ కూడా లభిస్తుంది. కాబట్టి, కిట్‌ కొనేటప్పుడే ఇన్‌స్టాలేషన్‌ గురించి కూడా అక్కడే అడగండి.


మీ పెట్రోలు కారులో CNG కిట్‌ను అమర్చిన తర్వాత, దానిని ఉపయోగించేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త గురించి కూడా మెకానిక్‌ను అడగండి. ఇది మీ & మీ కుటుంబ సభ్యుల భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి, మెకానిక్‌ చెప్పిన జాగ్రత్తలను కచ్చితంగా పాటించండి. పెట్రోల్‌తో పోలిస్తే CNG వాడకం వల్ల మీకు డబ్బు ఆదా కావడంతో పాటు పర్యావరణహితంగానూ ఉంటుంది.