Priyanka Chopra About SSMB29 Movie: ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ 'SSMB29'. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై హైప్ అంతా ఇంతా కాదు. సినిమా గురించి ఏ చిన్న బజ్ అయినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. 

రాజమౌళి మూవీ అంటేనే ఓ క్రేజ్. ఆయన ప్రాజెక్టుపై ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ సస్పెన్స్ మెయింటెన్ అవుతూనే ఉంటుంది. 'SSMB29' మూవీలో కూడా మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారన్న విషయం తప్ప ఇంక ఏ విషయం తెలీదు. ఇప్పటివరకూ బహిరంగంగా ఎవరూ ఈ మూవీపై స్పందించలేదు. తాజాగా... ప్రియాంక చోప్రా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది.

ఆసక్తిగా ఎదురుచూస్తున్నా

తాను ప్రస్తుతం ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు ప్రియాంక చోప్రా. మ్యారేజ్ తర్వాత హాలీవుడ్‌లో స్థిరపడిన ఆమె ఇక్కడి మూవీస్ మిస్ అవుతున్నట్లు తెలిపారు. 'నేను ఇండియా, హిందీ మూవీస్ మిస్ అవుతున్నా. ఈ ఏడాది ఓ ఇండియన్ మూవీలో నటిస్తున్నా. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇండియన్ ఆడియన్స్ నాపై చూపే ప్రేమ ఎంతో విలువైనది. అది ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా.' అని ప్రియాంక చెప్పారు.

ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతుండగా... మహేష్ అభిమానులు షేర్ చేస్తున్నారు. ఆమె 'SSMB29' గురించే మాట్లాడారంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కోసం తాము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ 'నరివెట్ట' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులోనో తెలుసా?

ఫస్ట్ మూవీ అదే...

తన ఊహ తెలిశాక తాను చూసిన ఫస్ట్ మూవీ మణిరత్నం దర్శకత్వం వహించిన 'ముంబయి' అని ప్రియాంక తెలిపారు. 'నేను చిన్నప్పుడు ఎక్కువగా సినిమాలు చూడలేదు. మా నాన్నకు మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఇంట్లో సంగీతం వినిపిస్తూనే ఉంటుంది. నా 13 ఏళ్ల వయసప్పుడు థియేటర్‌లో ముంబయి సినిమా చూశాను. నాకు ఊహ తెలిశాక చూసిన ఫస్ట్ మూవీ అదే. నేటికీ ఆ సినిమా చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది.' అని చెప్పారు.

ఇక 'SSMB29' మూవీ విషయానికొస్తే... ఆఫ్రికన్ అటవీ నేపథ్యం, ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా ఓ డిఫరెంట్ రోల్‌లో కొత్త లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. రామాయణంలోని 'సంజీవిని' సెంటర్ పాయింట్‌గా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ పలు షెడ్యూల్స్ పూర్తి కాగా కొత్త షెడ్యూల్ జులై రెండో వారంలో కెన్యాలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీక్వెన్స్ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారని సమాచారం. కొత్త షెడ్యూల్‌లో కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ జాయిన్ కాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.

దాదాపు రూ.1000 కోట్ల బడ్డెట్‌తో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... 2027లో ఈ మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.