Best Used Cars: ప్రస్తుతం భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. రూ.10 లక్షల్లోపు ధరలో ఎన్నో మంచి ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కార్లు కొన్నవారు వాటిని చక్కగా మెయింటెయిన్ చేస్తే వాటికి మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం మనదేశంలో రూ.10 లక్షల్లోపు ధరలో కొనదగ్గ టాప్-5 సెకండ్ హ్యాండ్ కార్ల గురించి తెలుసుకుందాం.


హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)
మనదేశంలో మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో క్రెటా కూడా ఒకటి. ఈ మొదటి తరం మోడల్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇందులో ఇప్పటికీ కొత్తగా అనిపించే ఫీచర్లను చూడవచ్చు. ఇందులో 1.6 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. సెకండ్ హ్యండ్ కార్ల మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. వీటిలో 1.6 లీటర్ డీజిల్ లేదా పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ రూ.8 లక్షల ధరలో దక్కితే మంచి ఆప్షన్ అనుకోవచ్చు. టాప్ ఎండ్ ఫీచర్లు కావాలనుకునే వారు ఎస్ఎక్స్ లేదా ఎస్ఎక్స్ (వో) వేరియంట్లను కొనుగోలు చేయవచ్చు.


హోండా సిటీ (Honda City)
హోండా సిటీ కారుకు మనదేశంలో మంచి పేరు ఉంది. హోండా సిటీ నాలుగో తరం కారు 1.5 లీటర్ ఐ-వీటెక్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజిన్‌లో 5 స్పీడ్ మాన్యువల్ వేరియంట్, డీజిల్ ఇంజిన్‌లో 6 స్పీడ్ మాన్యువల్ వెర్షన్ అందుబాటులో ఉన్నాయి. హోండా సిటీ అనేది ఒక కంఫర్టబుల్ కారు. సర్వీసింగ్‌కు కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు. నాలుగో తరం హోండా సిటీ కారును సెకండ్ హ్యాండ్‌లో రూ.6 లక్షల్లోపు దక్కించుకుంటే మంచి డీల్ అని చెప్పవచ్చు. అయితే కొనేముందు కారు కండీషన్ ఒకసారి చూసుకోవడం మంచిది.


మారుతి సుజుకి ఎస్-క్రాస్ (Maruti Suzuki S-Cross)
మారుతి సుజుకి విక్రయిస్తున్న బెస్ట్ కార్లలో ఎస్-క్రాస్ కూడా ఒకటి. అయితే దీన్ని షోరూంలో కొనాలనుకునే వారు ఎక్కువగా ఆలోచించేది హ్యాచ్‌బ్యాక్ కారుకు అంత ధర పెట్టడం అవసరమా అని. ఈ కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మారుతి సుజుకి ఎస్-క్రాస్ మంచి రైడ్ క్వాలిటీని అందిస్తుంది. రూ.10 లక్షల్లోపు ఈ కారు దొరికితే కండీషన్ చూసుకుని తీసుకోవడం బెస్ట్ అని చెప్పవచ్చు.


టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner)
టయోటా ఫార్చ్యూనర్ లాంటి లెజెండరీ వాహనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీది పెద్ద ఫ్యామిలీ అయితే అందరూ కలిసి బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఇది మంచి ఆప్షన్. దీని ధరల రేంజ్‌లో ఎక్కువ మైలేజీని అందించే వాహనం కూడా ఇదే. సరిగ్గా మెయింటెయిన్ చేస్తే ఎన్ని లక్షల కిలోమీటర్లు అయినా సులభంగా తిరిగేయడం దీని స్పెషాలిటీ. ఇది మంచి ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. ఒకవేళ రూ.10 లక్షల్లోపు ధరలో ఈ కారు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో లభిస్తే మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.


ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport)
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వాహనం మనదేశంలో 2013లో లాంచ్ అయింది. సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో మంచి కార్లలో ఇది కూడా ఒకటి. ఫోర్డ్ లాంచ్ చేసిన బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తుల్లో ఇది కూడా ఒకటి. ఇందులో అనేక ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వేరియంట్, కారు కొనుగోలు చేసిన సంవత్సరాన్ని బట్టి రూ.3 నుంచి రూ.10 లక్షల వరకు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ అందుబాటులో ఉంది. ఫోర్డ్ మనదేశాన్ని విడిచి వెళ్లిపోయినా కూడా దీన్ని సర్వీసింగ్ చేయించడం చాలా సులభం.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!