TATA Tiago: టాటా టియాగో.. భారత్ లోని అత్యంత సేఫ్టీ కార్లలో ముఖ్యమైనది. పెద్ద ప్రమాదాలు జరిగినా కారులోని ప్రయాణీకుల ప్రాణాలు రక్షిస్తుంది. తక్కువ ధరలో చక్కటి సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. అంతకు మించి ఆకట్టుకునే లుక్ తో వినియోగదారులను ఆకర్షిస్తుంది. టాటా టియాగో 4-స్టార్ సేఫ్టీ గ్లోబల్ NCAP రేటింగ్ తో అందుబాటులోకి వచ్చింది. EBDతో కూడిన ABS, ఓవర్‌స్పీడ్ వార్నింగ్, సెంట్రల్ లాకింగ్ వంటి భద్రతా ఫీచర్లు కారులో ఉన్నాయి. బలమైన నిర్మాణ ప్రమాణాల వల్ల పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తుంది. తాజాగా జరిగిన ఓ ఘటన గురించి తెలుసుకుంటే టాటా కార్ల పట్ల వినియోగదారులకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఘోర ప్రమాదం జరిగినా, ప్రాణహాని జరగలేదు
తాజాగా జరిగిన ఓ ప్రమాదంలో ఎల్లో కలర్ టాటా టియాగో ఘోరంగా దెబ్బతిన్నది. కానీ, కారులో ప్రయాణించే వారికి ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. శ్రీ సత్య ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా ఉన్న పెద్ద గుంతను గమనించకపోవడంతో దగ్గరికి వెళ్లాక యజమాని స్టీరింగ్ ను పక్కకి తిప్పాడు. ఆ సమయంలో కారు గంటకు 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. వెంటనే కారు నియంత్రణ కోల్పోయింది. అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ యజమానికి కుడి చేతిపై చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. స్నేహితులు ఇద్దరికీ చిన్న చిన్న గీతలు మినహా ఎలాంటి దెబ్బలు తగలలేదు. ప్రాణహానీ తప్పింది.
Read Also: మీరు కారు కొనాలి అనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ సేఫ్టీ కార్ల లిస్టు ఓసారి చూడండి!
మరో టియాగో కోసం ఆర్డర్
కారు పైకప్పు, విండ్ షీల్డ్ భారీగా దెబ్బతిన్నది. డ్రైవర్ వైపు కారు భాగం పూర్తిగా దెబ్బతింది. దీంతో యజమాని స్పృహ కోల్పోయి లోపలే ఇరుక్కుపోయాడు. వెంటనే స్థానికులు వారిని బయటకు తీయడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే, ప్రమాదం జరిగిన కారును మరమ్మత్తు చేయించుకోడానికి బదులుగా.. మరో టాటా టియాగో కారును కొనుగోలు చేసేందుకు ఆర్డర్ బుక్ చేశాడు. ఆ కారు తన ప్రాణాలు కాపాడిందని, అందుకే మరోసారి కూడా అదే కారును కొనుగోలు చేస్తున్నానని అతడు చెప్పడం గమనార్హం. ఈ సంఘటన సురక్షితమైన కార్ల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. టాటా కార్లు గొప్ప బిల్డ్, సాలిడ్ సేఫ్టీ ఫీచర్లకు కేరాఫ్ గా నిలిచాయి. చాలా మంది యజమానులు ఇలాంటి అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది కస్టమర్‌లలో అవగాహనను పెంచడంతో పాటు సేఫ్టీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. కంపెనీలు కూడా మరిన్ని భద్రతా ప్రమాణాలతో కార్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.
Read Also: రూ.11 వేలుకే ఎన్‌ఫీల్డ్ బైక్, ఈ దీపావళి ఆఫర్ భలే ఉంది - అదేలా సాధ్యం?