సాధారణంగా కారు కొనుగోలు చేయాలి అనుకునే వ్యక్తులు మొదటగా చూసేది సేఫ్టీ. భద్రత పరంగా బాగుంది అని నిర్ణయించుకున్న తర్వాతే ఇతర వివరాల గురించి ఆరా తీస్తారు. భారతీయ వినియోగదారులు కొంత కాలంగా భద్రత విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో  వాహన తయారీ సంస్థలు కూడా భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తాజాగా భారతీయ వాహనాలు ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలతో దుమ్మురేపుతున్నాయి. రీసెంట్ గా గ్లోబల్ NCAP భారతీయ కార్లలో భద్రతా ప్రమాణాల పరీక్షలను నిర్వహించింది. ఈ టెస్టింగ్ లో  5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్‌ చాలా కార్లు సత్తా చాటాయి. 'సేఫర్ కార్స్ ఫర్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా 50కి పైగా భారతీయ కార్లను క్రాష్-టెస్ట్ చేసింది.  ఆ 50 మోడళ్లలో అత్యధిక గ్లోబల్ NCAP రేటింగ్‌ పొందిన టాప్ 10 భారతీయ కార్ల గురించి ఇప్పుడు చూద్దాం..

   


ఫస్ట్ వోక్స్‌వ్యాగన్, సెకెండ్ స్కోడా  


వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ భారతదేశంలోని సురక్షితమైన కార్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.  గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్ ప్రమాణాలతో పరీక్షించబడిన తర్వాత, ఈ కార్లు అత్యధిక భద్రతా రేటింగ్‌ ను సంపాదించాయి. ఈ కార్లు పెద్దల  ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 29.64, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో  42 పాయింట్లు సాధించాయి.


రెండు, మూడు స్థానాల్లో టాటా, మహీంద్రా


SUVల విషయానికి వస్తే  టాటా పంచ్ భారతదేశంలోని సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో ఈ కారు 17 పాయింట్లకు 16.45 పాయింట్లు, పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు 40.89 పాయింట్లు సాధించి 3వ స్థానంలో నిలిచింది. జాబితాలో 4వ ర్యాంక్‌ను మహీంద్రా XUV300 సాధించింది.  ఇది పెద్దల రక్షణలో 17 పాయింట్లకు 16.42 పాయింట్లు, పిల్లల రక్షణలో 39 పాయింట్లకు 37.44 పాయింట్లను స్కోర్ చేసింది.  టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ పెద్దల విషయంలో 17 పాయింట్లుకు 16.13 పాయింట్లు, పిల్లల భద్రత విషయంలో 49కి 29 పాయింట్లను స్కోర్ చేసి 5వ ప్లేస్ దక్కించుకుంది.  ఆ తర్వాత టాటా నెక్సాన్ పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 17 పాయింట్లకు 16.06 పాయింట్లు, పిల్లల భద్రతలో 49 పాయింట్లకు 25 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది.  


మహీంద్రా XUV700 పెద్దల రక్షణలో  17 పాయింట్లకు 16.03 పాయింట్లు, పిల్లల భద్రతలో 49 పాయింట్లలో 41.66 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందగలిగిన హోండా జాజ్ 8వ  స్థానాన్ని ఆక్రమించింది. టయోటా అర్బన్ క్రూయిజర్ పెద్దల రక్షణలో 17 పాయింట్లకు 13.52 పాయింట్లు, పిల్లల భద్రత కోసం 49కి 36.68 పాయింట్లను పొందడం ద్వారా హోండా జాజ్ కంటే వెనుకబడి 9వ ప్లేస్ లో నిలిచింది.  మహీంద్రా మరాజో పెద్దల భద్రత విషయంలో 17 పాయింట్లకు 12.85 పాయింట్లు,  పిల్లల భద్రత రేటింగ్ లో 49 పాయింట్లకు 22.22 పాయింట్లు సాధించి జాబితాలో చివరి స్థానంలో నిలిచింది.