Kadapa News: బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోపవరం మండలం రాచాయపేటకు చెందిన ఓ బాలికపై కొందరు బాలురు లైంగిక దాడికి పాల్పడగా.. ఈ ఘటన చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. దాదాపు మూడు నెలల క్రితం ఓ బాలిక నేరేడుపండ్ల కోసం కొండ ప్రాంతానికి వెళ్లింది. అదే సమయంలో అక్కడ ఉన్న నలుగురు బాలురు ఆమెను లైంగికంగా వేధించారు. అంతా కలిసి ఆ బాలికపై అత్యాచారం చేశారు. వారి అమానుష చర్యను ఫోటోలు, వీడియోలు తీశారు. అయితే ఇదంతా జరిగినా.. ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. కానీ కొన్ని రోజుల క్రితం బాలికను బాలురు బలవంతం చేస్తున్న ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలను ఇతరులతో షేర్ చేసుకోగా అవి కాస్త ఒకరి నుండి మరొకరికి షేర్ అయ్యాయి. 


మూడు నెలల కింద ఘటన, ఇప్పుడు వెలుగులోకి


దీంతో, బాలిక తల్లిదండ్రులు వారిపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బద్వేల్ గ్రామీణ పోలీసులు నలుగురు మైనర్లపై పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం నలుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కడపలోని జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. బాధితురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎవరైనా షేర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. అలాంటి ఫోటోలను కానీ వీడియోలను కానీ ఎవరైనా గుర్తిస్తే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లేదా తమ ఫోన్ నంబర్ నుండి 94407 96900 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. 


'నిఘా లోపిస్తే నేరాలకు పాల్పడతారు'


గోపవరం మండలం రాచాయపేటలో వెలుగు చూసిన బాలికపై అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శనివారం నాడు స్పందించారు. కడప జిల్లా పోలీసు ఉన్నత అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. బాలికపై నలుగురు బాలురు అత్యాచారం చేయడంపై ఆమె ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల నడవడికను తల్లిదండ్రులు ఎప్పుడూ ఓకంట కనిపెడుతూ ఉండాలని, ముఖ్యంగా మగపిల్లలు ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారో గమనిస్తూ ఇండాలని వాసిరెడ్డి పద్మ సూచించారు.తల్లిదండ్రుల నిఘా లోపిస్తే విద్యార్థి దశలోనే నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 


ఇష్టారీతి ప్రవర్తన..


బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఆ ఘటనను ఫోటోలు, వీడియో తీసి స్నేహితులతో పంచుకున్న అంశం తనను తీవ్రంగా కలచి వేసిందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ అన్నారు. క్రమశిక్షణ కొరవడటం, సెల్ ఫోన్ల వినియోగంతో ఇష్టారీతిగా ప్రవర్తించడం జీవితాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, ఇంటి వాతావరణంలో పిల్లలకు మంచి అలవాట్లు, సంస్కారాన్ని నేర్పే కౌన్సెలింగ్ అవసరం ఎంతో ఉందని వాసిరెడ్డి పద్మ సూచించారు.


Also Read: ఏకాంతంగా గడుపుతూ యువతి తండ్రికి దొరికిపోయిన లవర్స్! భయపడిపోయి ఘోరం - కోపంతో తండ్రి మరో దుశ్చర్య