Visakha News : విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులు, వైసీపీ నేతల వాహనాలపై దాడి ఘటనపై పోలీసులు పలువురు జనసేన నేతలను అరెస్టు చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు జనసేన నేతలను అరెస్టు చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ లో పోలీసులు తనిఖీలు, అరెస్టులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
రాష్ట్రంలో నియంత పాలన
రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని చంద్రబాబు విమర్శించారు. విశాఖలో జనసేన కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. జనసేన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ చేస్తున్న కుట్రలు దుర్మార్గమని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ కారులో కూర్చోవాలో, బయటకు వచ్చి అభివాదం చేయాలో కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
" విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటనే విడుదల చెయ్యాలి. ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాహత్నం సెక్షన్ ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ బసచేసిన హోటల్‌లో సోదాలు, బెదిరింపులు నియంత పాలనకు నిదర్శనం"- చంద్రబాబు
వైసీపీ రాజకీయ యాత్ర విఫలమైందన్న ఉక్రోషం
విశాఖ ఎయిర్ పోర్టు ఘటన పేరుతో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చెయ్యడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన లోకేశ్.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నేతలను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ గదులను సోదా చేయడం, అక్కడ ఉన్న నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విశాఖలో వైసీపీ రాజకీయ యాత్ర విఫలమైందన్న ఉక్రోషం జనసేన నాయకులు, కార్యకర్తలపై చూపిస్తున్నారని లోకేశ్ విమర్శించారు.