ర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా జపాన్ లోనూ రికార్డులు బద్దలు కొడుతోంది. సినిమా విడుదల చేసిన తొలి రోజే రూ.1 కోటి వసూలు చేసి ఔరా ! అనిపించింది. అంతకుముందు జపాన్ లో విడుదలై, తొలి రోజు అధిక వసూళ్లను సాధించిన ప్రభాస్ 'సాహో' ను ఆర్.ఆర్.ఆర్ బీట్ చేసింది. జపాన్ లో సాహో తొలి రోజు 90 లక్షలు వసూలు చేయగా, ఆర్.ఆర్.ఆర్ కోటి రూపాయలు వసూలు చేసి టాప్ రికార్డు సృష్టించింది. ఆర్.ఆర్.ఆర్ జపాన్‌లో అక్టోబర్ 21 న చాలా అంచనాలతో విడుదలైంది. అనుకున్నట్టుగానే మొదటి రోజునే ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. సినిమాకు మంచి స్పందన రావడం, పాజిటివ్ టాక్ తో సినిమా ఈ వారాంతంలో 3.5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ఓ జపాన్ వెబ్ సైట్ లో రాశారు. 


రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ మూవీ కోసం జపాన్ లో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. అక్కడి ఫ్యాన్స్ తో కలసి మాట్లాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి లాంటి సినిమాలు అక్కడ మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. దీంతో ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు చేస్తున్నారు చిత్ర బృందం. జపాన్ లో రజనీకాంత్ లాంటి హీరోల తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. అందుకే ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ ను కలవడానికి వచ్చిన ఫ్యాన్స్ కొంతమంది భావోద్వేగానికి గురయ్యారు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఎన్టీఆర్ జపాన్ ఎప్పుడూ వెళ్లకపోయినా ఆయన సినిమాలు జపాన్ లో మంచి టాక్ తెచ్చుకోడంతో ఆయనకు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇటీవల జపాన్ లో ప్రమోషన్ కార్యక్రమంలో ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ జపనీస్ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వీరంతా సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు.


రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసిన నటించిన ఆర్.ఆర్.ఆర్ పై మొదట్నుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్, రాం చరణ్ తో అంతకముందు రాజమౌళి తీసిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది మార్చి లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డుల మోత మోగించింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం ఇలా భాషతో సంబంధం లేకుండా హిట్ టాక్ ను సొంతం చేసుకొని ఇండియన్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను ఓటీటీలలో ప్రదర్శిస్తున్నారు. సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడంతో ఇప్పుడు జపాన్ లో కూడా సినిమాను విడుదల చేసారు. అక్కడ కూడా తొలిరోజే రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.


Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్