దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయగా.. తాజాగా మరో కొత్త టూవీలర్ దీనికి జతచేరింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy ) కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేసింది. సింపుల్ వన్ (Simple One) అనే పేరున్న ఈ స్కూటర్ ధర భారత మార్కెట్లో రూ.1.10 లక్షలు (ఎక్స్ షోరూమ్ ప్రకారం) గా ఉంది. సింపుల్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రీ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని సంస్థ కల్పించింది. రూ.1947 చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపింది. 



బెస్ట్ బ్యాటరీతో ఎంట్రీ..
ఇండస్ట్రీలోనే బెస్ట్ బ్యాటరీతో సింపుల్ వన్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 4.8 కిలో వాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ఉండనుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ. ఈ స్కూటర్ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 236 కిలోమీటర్లు (IDC) ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ట వేగం విషయానికి వస్తే గంటకు 105 కిలోమీటర్లుగా ఉంది. 0 నుంచి 40 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కేవలం 2.95 సెకన్లలోనే అందుకోగలదు.



నాలుగు రైడ్ మోడ్స్..
సింపుల్ వన్ స్కూటర్‌లో 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. దీంతో డ్యాష్ బోర్డును కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎకో, రైడ్, డాష్, సోనిక్ అనే నాలుగు రైడ్ మోడ్స్ ఉన్నాయి. 12 అంగుళాల చక్రాలపై ఇది పరిగెట్టనుంది. ఇందులో బ్లూటూత్, 4జీ కనెక్టివిటీ, ఆన్ బోర్డ్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్ ఫంకన్లు ఉన్నాయి. సీట్ కింద 30 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. దీని బరువు 110 కేజీలుగా ఉంది. ఇది నలుపు, ఎరుపు, తెలుపు, నీలం కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 






సింపుల్ లూప్ చార్జింగ్ పాయింట్లు..
సింపుల్ వన్ బైక్స్ రాబోయే రెండు నెలల్లో దేశంలోని 13 రాష్ట్రాల్లోని 75 నగరాల్లో పరుగులు పెట్టనున్నాయని కంపెనీ చెబుతోంది. 2022 ఆగస్టు నాటికల్లా 176 నగరాలకు ఈ స్కూటర్లను విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది. రాబోయే 7 నెలల్లో దేశవ్యాప్తంగా సింపుల్ లూప్ పేరుతో 300 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లను ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది. 


Also Read: Ola Electric Scooter Launch: ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్లు... అదిరే ఫీచర్స్‌తో భారత్‌లోకి ఓలా స్కూటర్


Also Read: Tata EV Sedan Tigor: టాటా నుంచి టైగోర్ కారు.. వచ్చే వారంలో రిలీజ్.. ధర ఇంత ఉంటుందా?