అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ప్రజల్లో విశ్వాసం, భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు.
అఫ్గాన్ తాలిబన్ల వశమవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో తాలిబన్ల అరాచక పాలన తెలిసిన ప్రజలు దేశం నుంచి పారిపోయేందుకు విమానాశ్రయాలకు పోటెత్తుతున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు క్షమాభిక్ష ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Afghanistan President: అఫ్గాన్ తదుపరి అధ్యక్షుడు 'బరాదర్' గురించి షాకింగ్ విషయాలు!
శాంతిమంత్రం..
అఫ్గాన్ ఆక్రమణల్లో తాలిబన్లు ఈ సారి తమ సహజశైలికి భిన్నంగా శాంతి మంత్రం జపించారు. ఎక్కడా విధ్వంసానికి తెగబడలేదు. తమ ఆక్రమణతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎవరికీ హాని తలబెట్టబోమంటూ మరోసారి భరోసా ఇచ్చారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించొద్దంటూ తాము ఫైటర్లను ఆదేశించామని.. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా వారికి సూచనలు జారీ చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
అమెరికా నేతృత్వంలోని కూటమి తరఫున పనిచేసినవారిపై తామేమీ ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ హామీ ఇచ్చారు. అఫ్గాన్ ప్రజల్లో అనవసరపు భయాందోళనలను రేకెత్తించవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. యథావిధిగా పనులకు వెళ్లాలని తాలిబన్లు టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు.
కొత్త అధ్యక్షుడిగా..
అఫ్గానిస్థాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు సిద్ధం అవుతున్నారు. తదుపరి అధ్యక్షుడిగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ను ఎంపిక చేసింది తాలిబన్ల బృందం.
అయితే దోహా నుంచి రాజధాని కాబూల్ వచ్చి తదుపరి అధ్యక్షుడిపై తాలిబన్ నేతలు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫేస్ బుక్..
తాలిబన్లకు సంబంధించిన ఖాతాలను, సమాచారాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ఫేస్ బుక్ స్పష్టం చేసింది. డేంజరస్ ఆర్గనైజేషన్ పాలసీల కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
Afghanistan-Taliban Crisis: తాలిబన్లు ఉగ్రవాదులే.. నిషేధం విధించిన ఫేస్ బుక్