అఫ్గానిస్థాన్ లో పూర్తి పట్టు సాధించిన తాలిబన్లు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే అక్కడి ప్రజలు మాత్రం తీవ్రం భయాందోళనలో ఉన్నారు. అఫ్గాన్ లో ప్రస్తుత పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ తరుణంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. తాలిబన్లపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.


తాలిబన్లకు సంబంధించిన ఖాతాలను, సమాచారాన్ని ఈ మేరకు బ్యాన్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. డేంజరస్ ఆర్గనైజేషన్ పాలసీల కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.


Afghanistan President: అఫ్గాన్ తదుపరి అధ్యక్షుడు 'బరాదర్' గురించి షాకింగ్ విషయాలు!


అమెరికా చట్టాల ప్రకారం తాలిబన్లను ఉగ్రవాదులుగా గుర్తించాం. కనుక ప్రమాదకర పాలసీల కింద వారిపై నిషేధం విధించాం. తాలిబన్ల పేరుతో లేదా వారి కోసం పనిచేసే, మద్దతు పలికే ఖాతాలను తొలగిస్తాం. ఇందుకోసం అఫ్గానిస్థాన్ కు చెందిన కొంతమంది నిపుణులు మాకు సహకరిస్తారు. ఇలాంటి ఖాతాలను గుర్తించడంలో వారిని వినియోగిస్తాం.


                           ఫేస్ బుక్ ప్రతినిధి


తాలిబన్ల చేతిలోకి..


అఫ్గానిస్థాన్.. తాలిబన్ల చేతిలోకి వెళ్లోపోయిన రెండు రోజులకే ఫేస్ బుక్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అమెరికా బలగాలు అఫ్గానిస్థాన్ నుంచి వెనక్కి మళ్లుతున్న వేళ తాలిబన్లు సమయం చూసి దెబ్బకొట్టారు. మెరుపు వేగంతో అఫ్గాన్ రాజధాని కాబూల్ సహా కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. 


2 దశాబ్దాల పాటు సాగిన ఈ యుద్ధంలో చివరికి తాలిబన్లు విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు అడుగులు వేస్తున్నారు.


బైడెన్ క్లారిటీ..


తాలిబన్ల ఆక్రమణ తర్వాత తొలిసారి ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని, సైనిక బలగాలను బైడెన్‌ విమర్శించారు. అఫ్గాన్‌ సైనికులకు అన్ని రకాల వనరులు కల్పించి శిక్షణ ఇచ్చినప్పటికీ వారు తాలిబన్లతో పోరాడలేకపోయారన్నారు. అఫ్గాన్‌ పౌర ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి అన్ని అవకాశాలు ఇచ్చామని, అయితే వారికి సంకల్పం బలం మాత్రం ఇవ్వలేకపోయామని బైడెన్‌ అన్నారు. అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు బిలియన్‌ డాలర్లను అందించామని.. ఈ విషయంలో చైనా, రష్యా ఏం చేశాయని ప్రశ్నించారు. 


అమెరికా దళాలు, సిబ్బందిపై తాలిబన్లు దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. అఫ్గాన్‌ సంక్షోభం ఇక ఏమాత్రం అమెరికా జాతీయ భద్రతాంశం కాదన్నారు. అఫ్గానిస్థాన్‌ ప్రస్తుత పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని, ఆ దేశ  ప్రజలకు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. అఫ్గాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు, సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే అఫ్గాన్‌లో ఉన్న అమెరికా పౌరులను తరలించనున్నట్లు బైడెన్‌ పేర్కొన్నారు.


ALSO READ:


US Plane Inside Pics: ఆ విమానంలో 640 మంది తరలింపు... వైరల్ పిక్ పై క్లారిటీ ఇచ్చిన యూఎస్ రక్షణ అధికారులు