గడిచిన కొంత కాలంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. పెట్రో ధరల పెరుగుదల, పొల్యూషన్ ప్రీ జర్నీ పట్ల ప్రజల్లో అవగాహన వస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీల్లో ఓలా దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. ఈ కంపెనీకి చెందిన స్కూటర్లను పెద్ద సంఖ్యలో వినియోగదారులు కొనుగోలు చేశారు. మంచి ఫీచర్లు, అంతకు మించి బ్యాటరీ లైఫ్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయడం లాంటి వెసులుబాటు ఉంటడంతో ఓలా స్కూటర్ల పట్ల వినియోగదారులు బాగా ఆకర్షితులయ్యారు.


ఓలా వినియోగదారులకు గుడ్ న్యూస్


తాజాగా ఓలా కంపెనీ తమ స్కూటర్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. బైక్ ఛార్జర్ కోసం చెల్లించిన డబ్బులను వెనక్కి తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఇప్పటికే ఓలా తమ కస్టమర్లకు రీఫండ్ చేయడం మొదలు పెట్టింది. ఆయా మోడల్స్ ను బట్టి రూ. 9 వేల నుంచి రూ.19 వేల వరకు వెనక్కి ఇస్తున్నట్లు తెలిపింది. స్కూటర్ కొనుగోలు సమయంలో ఛార్జర్ కోసం ఈ డబ్బును తీసుకుంది.  


కేంద్రం హెచ్చరికతో వెనక్కి తగ్గిన ఓలా


ఓలా ఈ డబ్బును రీఫండ్ చేయడం వెనుక పెద్ద స్టోరీ ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ల నుంచి వసూలు చేసిన ఛార్జర్ డబ్బులను తిరిగి వారికి ఇచ్చిన తర్వాతే, కంపెనీకి సబ్సిడీ డబ్బులు పూర్తిగా లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం కండీషన్ పెట్టింది. దీంతో డబ్బులు వెనక్కి ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఓలా కంపెనీ చార్జర్‌ను యాడ్ ఆన్ సర్వీస్ కింద వినియోగదారులకు అందించింది. చార్జర్ ధరను స్కూటర్ ధరలో యాడ్ చేయలేదు.  ఈ నేపథ్యంలో ఛార్జర్ కోసం కస్టమర్లు ఆయా మోడల్ ను బట్టి రూ. 9 నుంచి రూ. 19 వేల వరకు అదనంగా చెల్లించారు. ఈ పద్దతిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఛార్జర్ ను వేరేగా అమ్మితే సబ్సిడీ పొందలేరని తేల్చి చెప్పింది. ఛార్జర్ ను విడిగా కొనుగోలు చేసిన వారికి డబ్బు రీఫండ్ చేయాలని తేల్చి చెప్పింది. అలా చేయని నేపథ్యంలో సబ్సిడీ ఇవ్వమని వెల్లడించింది. దీంతో ఓలా కంపెనీ వినియోగదారులకు ఛార్జర్ డబ్బులను రీఫండ్ చేయడం మొదలుపెట్టింది.


లక్ష మంది వినియోగదారులకు రీఫండ్ చేయనున్న ఓలా    


ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా సుమారు లక్ష మంది వినియోగదారులకు ఛార్జర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ తో కాకుండా విడిగా అమ్మినట్లు ఓలా కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. వారందరికీ డబ్బులు వాపసు ఇచ్చేస్తామని చెప్పింది. అంతేకాదు, ఈ ఏడాది మార్చి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్, చార్జర్ ను కలిపి విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి తమ వినియోగదారులకు ఛార్జర్ డబ్బులను  రీఫండ్ చేయడం మొదలు పెట్టింది ఓలా. సుమారు రూ. 130 కోట్ల రూపాయలను రీఫండ్ చేయనుంది.






Read Also: ఈ వేసవిలో మీ కార్లను ఇలా కాపాడుకోండి!