Death Penalty: దేశంలో మరణశిక్ష అమలుకు అనుసరిస్తున్న ఉరితీసే విధానాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ క్రమంలోనే ఈ విధానాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలపింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకట రమణి సుప్రీం కోర్టుకు వెల్లడించారు. అలాగే మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీసే విధానం సరైనదేనా, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా అనే అంశాల పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు అవసరం అని సుప్రీం కోర్టు సలహా ఇచ్చింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతిపాదిత ప్యానెలలో సభ్యులను ఎంపిక చేసేందుకు కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం.. ఈ కేసులో తదుపరి విచారణ తేదీని వేసువి సెలవుల తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది. 


న్యాయవాది రిషి మల్హోత్ర.. మరణశిక్ష అమలులో ఉరితీసే పద్దతికి ఉన్న రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికాలో ప్రాణాంతకమైన ఇంజక్షన్ ద్వారా మరణ శిక్ష అమలు చేస్తుండగా.. మన దేశంలో ఉరిశిక్ష విధానం అనుసరిస్తున్నారు. అయితే దాంతో పోలిస్తే ఉరితీత అనేది చాలా క్రూరమైన, దారుమైన విధానం అని రిషి మల్హోత్ర పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఉరిశిక్ష అమలుకు మానవీయ పద్ధతుల్లో ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశాలను పరిశీలించడానికి మరింత అంతర్లీన సమాచారం అవసరం అని కేంద్రానికి సూచించింది. దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.