Mercedes Electric Cars: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో తన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను పెంచే ప్రయత్నంలో, వాటి కొనుగోలుపై రూ. ఐదు లక్షల వరకు ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్‌ను అందించింది. మెర్సిడెస్ బెంజ్ సస్టైనబిలిటీ ఫెస్ట్‌లో భాగంగా అనేక ఇతర ప్రయోజనాలతో పాటు, ఇప్పటికే ఉన్న తన కస్టమర్‌లకు లాయల్టీ బోనస్‌ను కూడా అందిస్తోంది.


ఈ డిస్కౌంట్ ఆఫర్ కంపెనీకి చెందిన అన్ని ఎలక్ట్రిక్ కార్లకు వర్తిస్తుంది. దీనిలో కంపెనీ ప్రస్తుత కస్టమర్లు ఏదైనా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లయితే రూ. ఐదు లక్షల తగ్గింపును పొందవచ్చు. కంపెనీ ఈవీ లైనప్‌లో ఈక్యూబీ, ఈక్యూఈ, ఈక్యూఎస్ వంటి మోడల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ తగ్గింపు ఆఫర్ కింద ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.


ఆఫర్ ఏంటి?
2025 నాటికి మెర్సిడెస్ బెంజ్ తన పోర్ట్‌ఫోలియోలో 50 శాతం ఈవీలతో మొత్తం లైనప్‌ను 2030 నాటికి ఎలక్ట్రిక్‌కు పెంచే ప్రణాళికపై పని చేస్తోంది. దీని కోసం ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడానికి అక్టోబర్ చివరి బుధవారం సస్టైనబిలిటీ డేని జరుపుకోవడానికి కంపెనీ సస్టైనబిలిటీ ఫెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై వినియోగదారులకు రూ. ఐదు లక్షల తగ్గింపు, దీంతోపాటు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.


మెర్సిడెస్ బెంజ్ రిజిస్ట్రేషన్‌పై రోడ్డు పన్ను విధించే రాష్ట్రాల్లోని వినియోగదారులకు 50 శాతం ట్యాక్స్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. ఇందులో తెలంగాణ, కేరళ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఇది కాకుండా కంపెనీ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు అదనపు యాడ్ఆన్‌గా ఉచిత ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.


2023లో పెరిగిన అమ్మకాలు
ప్రస్తుతం భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ ఈవీ లైనప్‌లో భాగంగా ఈక్యూబీ 7 సీటర్ ఎస్‌యూవీ, కొత్త ఈక్యూఈ ఎస్‌యూవీ, ఈక్యూఎస్ లగ్జరీ సెడాన్‌లను విక్రయిస్తుంది. కంపెనీ భారతదేశంలో ఉన్న మొత్తం ఈవీ అమ్మకాల్లో ఐదు శాతం వాటాను కలిగి ఉంది. 2023లో సెప్టెంబర్ వరకు కంపెనీ 638 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది.


మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో స్టార్ ఎజిలిటీ ప్లస్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తోంది. ఇందులో కస్టమర్లకు ఆకర్షణీయమైన డౌన్ పేమెంట్, ఈఎంఐ ఆప్షన్, మొదటి సంవత్సరానికి ఉచిత బీమా, తక్కువ డౌన్ పేమెంట్ ప్లాన్, నాలుగు సంవత్సరాల వారంటీ, మెయింటెనెన్స్ ప్యాకేజీ లభిస్తాయి.


మరోవైపు రోల్స్ రాయిస్ ఇటీవలే తన ఘోస్ట్ సెలూన్ కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. అక్టోబర్ 14వ తేదీన సంవత్సరానికి ఒకసారి మాత్రమే పశ్చిమ అర్ధగోళంలో ఏర్పడే సూర్య గ్రహణం నుంచి ఇన్‌స్పైర్ అయి దీన్ని డిజైన్ చేశారు. రోల్స్ రాయిస్ దీనికి బ్లాక్ బ్యాడ్జ్ అని పేరు పెట్టింది. ఘోస్ట్ ఎక్లిప్స్ మోడల్‌లో కేవలం 25 యూనిట్లను మాత్రమే రోల్స్ రాయిస్ తయారు చేయనుంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial