TTD News: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజైన ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు పరమపద వైకుంఠనాథుని అలంకారంలో ఏడుతలల పెద్ద శేషవాహనం తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనసేవ జరుగనుంది.
నవరాత్రి కొలువు ప్రత్యేకం
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నవరాత్రి కొలువు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రాత్రి వాహనసేవ అనంతరం ఒక గంట పాటు ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కొలువు జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పెద్దశేష వాహనంపై ఆశీనులను చేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ధూపం, దీపం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం సమర్పించి శోడషోపచారాలు చేస్తారు. ఇందులో వేదపండితులు దివ్యప్రబంధాన్ని పఠిస్తారు. చివరగా అర్చకులకు శఠారి, బహుమానం సమర్పిస్తారు. వాహనసేవల్లో అలసిపోయిన స్వామి, అమ్మవార్లకు ఉపశమనం కల్పించేందుకు ఈ కొలువు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
ఆకట్టుకున్న బొమ్మల కొలువు
నవరాత్రి బ్రహ్మోత్సవాల మొదటిరోజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బొమ్మల కొలువు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో రంగనాయకుల మండపాన్ని ఆపిల్స్, కట్‌ఫ్లవర్లు, సంప్రదాయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవితోపాటు దశావతారాల బొమ్మలను కొలువుతీర్చారు.
ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నాదనీరాజనం వేదికపై ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా జేఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, కొత్తగా వెలుగులోకి తీసుకువచ్చిన అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి తొలిసారిగా భక్త కోటికి నవరాత్రి బ్రహ్మత్సవాల్లో అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం నాదనీరాజనం వేదికపై సంకీర్తనలను ప్రముఖ స్వరకర్తలు ఆలపిస్తున్నట్లు వివరించారు. అనంతరం చెన్నైకి చెందిన శ్రీమతి గాయత్రి నారాయణ, హైదరాబాద్‌కు చెందిన శ్రీ ఫణి నారాయణ, నేమని పార్థసారథి కీర్తనలను ఆలపించారు.
కళాకారులకు ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల్లో ప్రదర్శనలిచ్చేందుకు 14 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చారని, వారికి ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజు ఆదివారం తిరుమల అన్నమయ్య భనవంలో జేఈఓ మీడియా సమావేశం నిర్వహించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులను ఆకట్టుకునేలా కళారూపాలను ఎంపిక చేశామన్నారు. కళాబృందాల ప్రదర్శన వీడియోలను ముందుగానే తెప్పించుకుని పరిశీలించి ఎంపిక చేసినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, పశ్చిమబెంగాళ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మణిపూర్ తదితర రాష్ట్రాల నుంచి కళాబృందాలు వస్తున్నట్టు జెఈవో తెలిపారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యంతో పాటు జానపద నృత్యాలు, స్థానికులైన తిరుమలలోని బాలాజి నగర్, తిరుపతికి చెందిన పలు కళాబృందాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలియజేశారు.