ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. అన్ని రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వరదలు బీభత్సం సృష్టిస్తుంటే, మరికొద్ది రాష్ట్రాల్లో మాత్రం వానలు మామూలుగా పడుతున్నాయి. కాసేపు వర్షాలు ఎలా పడుతున్నాయి అనే విషయాన్ని పక్కన పెడితే, వర్షా కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, వాటికి ఛార్జింగ్ పెట్టడం సురక్షితమేనా? అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. చిన్నప్పటి నుంచి పెద్దలు ఒకటే మాట చెప్తుంటారు. ‘కరెంటు, నీళ్ళు కలవవు’ అని. అదే వాస్తవం అయితే, ఎలక్ట్రిక్ కార్ల పరిస్థితి ఏమిటి?
వరద నీటిలో ఎలక్ట్రిక్ కారు ఎంతసేపు నడపవచ్చు?
నిజానికి ఎలక్ట్రిక్ కార్లను ఎప్పటి లాగే వానాకాలంలోనూ సేఫ్ గా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని EVలలో, ఇన్‌గ్రెస్ ప్రొటెక్షన్ లేదంటే IP రేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. దీని కారణంగా మీ ఎలక్ట్రిక్ వెహికల్ కు సంబంధించిన బ్యాటరీ దుమ్ము, నీటి నుంచి సురక్షితంగా ఉంటుంది. అయితే, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వల్ల, ఎలక్ట్రిక్ వాహనాలు ఎంత వరకు నీటిలో మునిగితే సేఫ్ గా ఉంటుంది? అనే ప్రశ్నకూడా ఉత్పన్నం అవుతుంది. నిజానికి ఎక్కువ వరదలు ఉన్న రోడ్ల మీద నడపకపోవడం మంచింది. అయితే, IP67 రేటింగ్ ఉన్న కార్లు 1 మీటర్ నీటిలో 30 నిమిషాల ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంది. నిజానికి నీటిని తట్టుకునేలా కారుకు చాలా ప్రొటెక్షన్ లేయర్లు ఉంటాయి. నీరంతా లోపలికి వచ్చినా బ్యాటరీ సురక్షితంగా ఉంటుంది. డ్రైవర్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. అందుకే వర్షం పడిన సమయంలో ఎలక్ట్రిక్ కార్లు నడపడంలో ఎలాంటి సమస్య ఉండదు. కాకపోతే ఇతర కార్ల మాదిరిగానే కాస్త జాగ్రత్తలు పడటం మంచిది.
వర్షం పడుతుంటే ఛార్జింగ్ పెట్టడం సేఫేనా?
వర్షం పడుతున్న సమయంలో ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ పెట్టడం ఎంత వరకు సేఫ్ అనే ప్రశ్నలు కూడా వస్తాయి. అయితే, వర్షాల సమయంలో ఛార్జింగ్ పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కేబుల్ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఛార్జింగ్ కేబుల్, ప్రతి కాంపోనెంట్ వెదర్ ప్రూఫ్‌గా ఉంటుంది. కాబట్టి వర్షం పడుతున్నా వాహనానికి సేఫ్ గా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
వాస్తవానికి ఎలక్ట్రిక్ కార్లు చాలా పరీక్షల తర్వాతే అమ్మాకానికి అందుబాటులోకి వస్తాయి. ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ వాహనాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆయా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలకు ఎప్పటికప్పుడు సేఫ్టీ మెజర్ మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. కొద్ది నెలల క్రితం ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలడంతో కొంత కాలం పాటు వినియోగదారులు వాటి కొనుగోలు పట్ల ఆందోళన పడ్డారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూకుండా తయారీ సంస్థలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
Read Also: వర్షాకాలంలో డ్రైవింగ్ చేస్తున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వకపోతే ప్రమాదం!