Maruti Suzuki: భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధిక త్రైమాసిక విక్రయాలు, లాభాలతో అపూర్వమైన విజయాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ ఏకంగా 80.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.


మారుతి సుజుకీ గత ఏడాది ఇదే కాలంలో రూ.2,061.5 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసిక లాభం రూ.3,716.5 కోట్లుగా నమోదైంది. ఈ అద్భుతమైన పనితీరులో మొదటిసారిగా ఆరు నెలల్లో 1 మిలియన్ యూనిట్ల విక్రయాలు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 10 లక్షలకు పైగా వాహనాలను విక్రయించడం, భారతదేశంలో SUV మార్కెట్‌లో మొదటి స్థానాన్ని సాధించడం వంటివి ఉన్నాయి. ఇది కాకుండా మారుతి దేశంలో రెండు కొత్త కార్లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.


కొత్త తరం మారుతి స్విఫ్ట్
కొత్త తరం మారుతి స్విఫ్ట్ 2024 ఫిబ్రవరి నాటికి భారతదేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది సరికొత్త, అధునాతన రూపంతో... డిజైన్, ఫీచర్ల పరంగా అనేక ముఖ్యమైన అప్‌డేట్‌లతో వస్తుంది. 2024 స్విఫ్ట్‌కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లలో ఒకటి దాని కొత్త 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజన్. ప్రస్తుత మోడల్ 1.2 లీటర్ 4 సిలిండర్ కే-సిరీస్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది.


ఈ కొత్త ఇంజిన్ మరింత పర్యావరణ అనుకూలమైనది, మరింత ఫ్యూయల్ ఎఫీషియంట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇండియా స్పెక్ స్విఫ్ట్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ని కలిగి ఉండవచ్చు. ఇది అత్యంత ఇంధన సామర్థ్య కారుగా మారుతుంది. బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన కొత్త స్విఫ్ట్ సుమారు 35 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు మైలేజీని పొందగలదని అంచనా వేస్తున్నారు. లాంచ్ అయిన తర్వాత ఇది హ్యుందాయ్ ఐ10 నియోస్, టాటా టియాగో వంటి కార్లతో పోటీపడుతుంది.


కొత్త తరం మారుతి డిజైర్
స్విఫ్ట్‌తో పాటు మారుతి కొత్త తరం డిజైర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది 2024 ఏప్రిల్ లేదా మే నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. స్విఫ్ట్ మాదిరిగానే డిజైర్ కూడా ముఖ్యమైన డిజైన్, ఫీచర్ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఇది ఆకర్షణీయమైన ప్యాకేజీగా రానుంది. ఇది స్విఫ్ట్ మాదిరిగానే ఇంజిన్ ఆప్షన్‌ను కూడా పొందవచ్చని భావిస్తున్నారు. లాంచ్ టైమ్‌లైన్ దగ్గరికి వచ్చేసరికి ఇతర వివరాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి కార్లతో పోటీపడుతుంది.


మరోవైపు దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ హ్యుందాయ్ కూడా రాబోయే సంవత్సరాల్లో అనేక కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. అల్కజార్, క్రెటా, కోనా ఈవీ వంటి దాని ప్రస్తుత మోడళ్లలో కొన్నింటిని కూడా అప్‌డేట్ చేయనుందని సమాచారం. ఈ లేటెస్ట్ అప్‌డేట్ చేసిన మోడల్స్ 2024లో లాంచ్ అవుతాయని అంచనా. దీంతోపాటు హ్యుందాయ్ తన వెన్యూ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ కొత్త తరం మోడల్‌ను 2025లో లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఇది కాకుండా క్రెటా, ఎక్స్‌టర్ వంటి పాపులర్ కార్లలో ఎలక్ట్రిక్ వెర్షన్లను విడుదల చేయడానికి హ్యుందాయ్ సన్నాహాలు చేస్తోంది. ఎక్స్‌టర్ ఈవీ ఎప్పుడు లాంచ్ కానుందనేది మాత్రం తెలియరాలేదు.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial