Maruti Suzuki Arena: దేశంలోనే నంబర్ వన్ ప్యాసింజర్ కార్ కంపెనీ మారుతి సుజుకీ మహిళలకు అతిపెద్ద ఆప్షన్‌గా మారింది. ఇప్పటి వరకు తొమ్మిది లక్షలకు పైగా కార్లను మహిళలకు విక్రయించినట్లు మారుతి సుజుకీ పేర్కొంది. దీనికి సంబంధించి మారుతి సుజుకీ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది.


ఇప్పటి వరకు ఎరీనా డీలర్‌షిప్‌లో 9 లక్షల మందికి పైగా మహిళలకు కార్లను విక్రయించినట్లు మారుతి సుజుకీ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2017-18 సంవత్సరం, 2023-24 సంవత్సరాల మధ్య కార్లు కొనుగోలు చేసే మహిళల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2017-18లో 18 శాతం మంది మహిళలు మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేయగా, ఇప్పుడు వారి వాటా 2023-24లో 28 శాతానికి పెరిగింది.


మహిళా డ్రైవర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మారుతి సుజుకీ ఎరీనా సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కార్లు నడుపుతున్న మహిళల సంఖ్యను పెంచడమే ఈ ప్రచారం లక్ష్యం. ఈ క్యాంపెయిన్ కింద స్త్రీల కథలను తెరపైకి తీసుకురానున్నారు. మారుతి సుజుకి దీనికి ఎరీనా జర్నీ అని పేరు పెట్టింది. ఎరీనా జర్నీ ప్రారంభం గురించి కంపెనీ మార్కెటింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.


2023-24 సంవత్సరంలో 28 శాతానికి పైగా మహిళలు మారుతి సుజుకీని ఎంచుకున్నారని, ఇది తమ కంపెనీకి గర్వకారణమని ఆయన అన్నారు. శశాంక్ శ్రీవాస్తవ ఇంకా మాట్లాడుతూ ఎరీనా జర్నీ తమకు క్యాంపెయిన్ కంటే ఎక్కువ అని తెలిపారు.


మారుతి సుజుకీ చాలా కాలంగా భారతదేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ కారు కంపెనీగా కొనసాగుతోంది. భారతీయ కారు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించే ఈ కంపెనీ తన కార్లను నెక్సా, ఎరీనా అనే రెండు డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తుంది. మారుతి సుజుకి ప్రీమియం కార్లను నెక్సా ద్వారా విక్రయిస్తున్నారు. ఎరీనా డీలర్‌షిప్ ఎక్కువగా చిన్న కార్లను విక్రయిస్తుంది.


మరోవైపు కియా ఇండియా నాలుగు లక్షలకు పైగా కనెక్టెడ్ కార్లను విక్రయించిన మైలురాయిని సాధించింది. కనెక్టెడ్ కార్ వేరియంట్‌లు కియా ఇండియా మొత్తం దేశీయ విక్రయాల్లో 40 శాతానికి పైగా ఉండటం విశేషం. కియా కనెక్టెడ్ కార్ వేరియంట్‌ల విక్రయాలు ప్రతి యేటా 30.9 శాతం మేర పెరుగుతున్నాయని కంపెనీ అధికారికంగా పేర్కొంది. మొత్తం అమ్మకాల్లో 65 శాతం వాటాతో సెల్టోస్ ఎస్‌యూవీ కియా మొత్తం కనెక్టెడ్ కార్ల విక్రయాలలో మొదటి స్థానంలో నిలిచింది. కియా సెల్టోస్ మోడళ్లలో కస్టమర్ ప్రాధాన్యత కూడా కనెక్టెడ్ వేరియంట్ వైపే ఉంది. ఇప్పటివరకు అమ్ముడుపోయిన అన్ని సెల్టోస్ యూనిట్లలో 57 శాతం వరకు కనెక్టెడ్ కార్లే ఉండటం విశేషం. సెల్టోస్ తర్వాత 31 శాతంతో కియా కారెన్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. కియా సోనెట్‌లో కనెక్టెడ్ కార్ ఆప్షన్ ఏడు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఈ మోడల్స్ మొత్తం సోనెట్ అమ్మకాల్లో 21 శాతం వరకు ఉన్నాయి.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!