Dharamshala Test  Win:  ధర్మశాల(Dharamshala) దద్దరిల్లింది. టీమిండియా(Team India) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌(England) జట్టు చిత్తయింది. తొలుత బ్యాట్‌తో తర్వతా బంతితో భారత జట్టు చెలరేగిన వేళ బ్రిటీష్‌ జట్టు అయిదో టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ తేడాతో  పరాజయం పాలైంది. మూడు రోజుల్లోనే ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతోమట్టికరిపించింది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ దక్కించుకున్న రోహిత్‌ సేన ఈ గెలుపుతో తన ఆధిక్యాన్ని 4-1కు పెంచుకుంది. అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌కు తోడు వైస్‌ కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రా బంతితో చెలరేగారు. తొలుత అశ్విన్‌ ఇంగ్లాండ్‌ బ్యాటర్ల పని పట్టగా తర్వాత కుల్‌దీప్‌ ఆ జోరు కొనసాగించాడు. హార్ట్‌లీ- రూట్‌ ఇన్నింగ్స్‌ తేడా నుంచి ఇంగ్లాండ్‌ జట్టును బయట పడేసేందుకు ప్రయత్నించినా... బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. రూట్ ఓపిగ్గా బ్యాటింగ్‌ చేసినా ఇంగ్లాండ్‌కు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ గెలుపుతో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో అగ్రస్థానాన్ని టీమిండియా పదిలం చేసుకుంది.

 

తొలిఇన్నింగ్స్‌లో భారీ స్కోరు

రోహత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) శతకాలతో కదం తొక్కిన వేళ.. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 218 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్‌ 103, గిల్‌ 110 పరుగులతో చెలరేగారు. దేవ్‌దత్‌ పడిక్కల్, సర్ఫరాజ్‌ఖాన్‌ అర్ధ శతకాలతో మెరిశారు. టెస్టు క్రికెట్‌ అరంగేట్రం మ్యాచ్‌లోనేఅర్ధ శతకం సాధించిన పడిక్కల్ 65 పరుగులు చేయగా సర్ఫరాజ్‌ 56 పరుగులు చేసి వెనుదిరిగారు. తర్వాత జడేజా, ధ్రువ్‌ జురేల్, అశ్విన్ తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరినా చివర్లో కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా ఇంగ్లాండ్‌ బౌలర్లను గట్టిగా ప్రతిఘటించారు. చివరకు 477 పరుగుల వద్ద భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.

 

ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు చుక్కలు

259 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌కు తోడు వైస్‌ కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రా బంతితో చెలరేగారు. తొలుత అశ్విన్‌ ఇంగ్లాండ్‌ బ్యాటర్ల పని పట్టగా తర్వాత కుల్‌దీప్‌ ఆ జోరు కొనసాగించాడు. వరుసగా వికెట్లు తీస్తూ బ్రిటీష్‌ బ్యాటర్లను అసలు క్రీజులు కుదురుకోనివ్వలేదు. జో రూట్‌ ఒంటరి పోరాటం చేసినా అది ఇన్నింగ్స్‌ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. వందో టెస్టులో అశ్విన్‌ అదరగొట్టాడు. 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కష్టాల్లో నెట్టాడు. అశ్విన్‌ విజృంభణతో బ్రిటీష్‌ జట్టు 113 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత హార్ట్‌లీ- రూట్‌ ఇన్నింగ్స్‌ తేడా నుంచి ఇంగ్లాండ్‌ జట్టును బయట పడేసేందుకు ప్రయత్నించినా... బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. 34.2 ఓవర్‌ వద్ద బుమ్రా వేసిన బంతికి హార్ట్‌లీ (20) వికెట్ల ముందు దొరికిపోగా... ఒక బంతి తర్వాత మార్క్‌ వుడ్ ఎదుర్కొన్న రెండో బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. కాసేపు బషీర్‌-రూట్‌ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. 13 పరుగులు చేసిన బషీర్‌ను రవీంద్ర జడేజా బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 189 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే ఇంగ్లాండ్‌ ఆలౌట్‌ అవ్వగా... భారత జట్టుకు ఇన్నింగ్స్‌ విజయం దక్కింది.