Dharamshala test: ధర్మశాల టెస్టులో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలమైన చోట మనోళ్లు శతక గర్జన పూరించారు. కెప్టెన్ రోహిత్‌శర్మ, శుభ్‌మన్‌గిల్ సూపర్ సెంచరీలతో చెలరేగిన వేళ..టీమ్‌ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్ళింది. తొలి ఇన్నింగ్స్ 477 పరుగుల వద్ద ముగిసింది. 437/8తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 40 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది.
ఇంగ్లాండ్(England)తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో టీమిండియా(Team India) పట్టు బిగించింది. రోహత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్ గిల్(Shubman Gill) శతకాలతో కదం తొక్కిన వేళ.. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో రెండో రోజు కూడా భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 218 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. వికెట్ నష్టానికి.... 135 పరుగుల వద్ద భారత్ జట్టు బ్యాటింగ్ కొనసాగించగా..రెండో వికెట్‌కు రోహిత్, శుభ్‌మన్ గిల్ 171 పరుగులు జోడించారు. ఈ క్రమంలో.. ఇద్దరూ శతకాలతో రాణించారు. రోహిత్ 103, గిల్ 110 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్ చేరగా.. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్‌ఖాన్ అర్ధ శతకాలతో మెరిశారు. టెస్టు క్రికెట్ అరంగేట్రం మ్యాచ్‌లోనేఅర్ధ శతకం సాధించిన పడిక్కల్ 65 పరుగులు చేయగా సర్ఫరాజ్ 56 పరుగులు చేసి వెనుదిరిగారు. తర్వాత జడేజా, ధ్రువ్ జురేల్, అశ్విన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినా చివర్లో కుల్‌దీప్ యాదవ్, బుమ్రా ఇంగ్లాండ్ బౌలర్లను గట్టిగా ప్రతిఘటించారు. 437/8తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 40 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. చివరి వికెట్‌గా వెనుదిరిగిన బుమ్రా 20 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లు పడగొట్టగా జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్‌లీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 259 పరుగుల ఆధిక్యం లభించింది.
హిట్‌మ్యాన్ రికార్డుల జోరు
రోహిత్ శర్మకు టెస్టుల్లో ఇది 12వ శతకం. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 48వ సెంచరీ. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టిన తర్వాత తాజా శతకంతో కలిపి హిట్‌మ్యాన్ ఖాతాలో మొత్తం 9 సెంచరీలు ఉన్నాయి. రూట్ 13 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా... మార్నస్ లబుషేన్ 11, కేన్ విలియమ్సన్ 10 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ తొమ్మిది శతకాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ తర్వాత పాక్ స్టార్ బాబర్ ఆజం ఎనిమిది సెంచరీలతో అయిదో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌శర్మ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ శతకాలు బాదిన వారి జాబితాలో 43 సెంచరీలతో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. ఓపెనర్లుగా వార్నర్(49), సచిన్(45) తర్వాత స్థానంలో రోహిత్ నిలిచాడు. ఇంగ్లాండ్‌పై ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు బాదిన భారత క్రికెటర్‌గా సునీల్ గవాస్కర్ సరసన రోహిత్ నిలిచాడు. వీరిద్దరూ నాలుగో సెంచరీలు చేశారు.
సిక్సర్ల రికార్డు కూడా
అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సులు కొట్టడంతో తనను మించిన మొనగాడు మరొకరు లేరని టీమిండియా సారధి రోహిత్‌శర్మ మరోసారి నిరూపించాడు. ఇప్పటికే సిక్సర్ల కింగ్‌లా పేరు గడించిన హిట్‌మ్యాన్ మరో అరుదైన రికార్డున తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రోహిత్‌శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో హిట్‌మ్యాన్ ఈ ఘనత సాధించాడు.