Kia June 2023 Sales Report: దక్షిణ కొరియా ఆటోమేకర్ బ్రాండ్ కియా మోటార్స్ ఇండియా గత నెలలో విక్రయాలు 19 శాతం (2022 జూన్‌తో పోలిస్తే) పడిపోయాయి. అయితే 2023 మే నెలతో పోలిస్తే మాత్రం మూడు శాతం పెరిగాయి. ఉన్నంతలో అదే కాస్త మేలు. కియా క్యారెన్స్, కియా సోనెట్ కార్లు అమ్మకాల్లో ముందంజలో ఉన్నాయి. కానీ కియా సెల్టోస్ అమ్మకాలు మాత్రం పడిపోయాయి.


2023 జూన్‌లో కియా ఇండియా మొత్తం 19,391 యూనిట్లను విక్రయించింది. 2022 జూన్‌లో అమ్ముడుపోయిన 24,024 యూనిట్ల కంటే ఇది 19 శాతం తక్కువ. కానీ 2023 మేలో విక్రయించిన 18,766 యూనిట్ల కంటే ఇది మూడు శాతం ఎక్కువ. మార్కెట్లోకి కొత్త సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కియా తీసుకురానుంది. దీని బుకింగ్ జూలై 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.


2023 జూన్‌లో కియా క్యారెన్స్ ఎంపీవీ అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. దీనికి సంబంధించి మొత్తంగా 8,047 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2022 జూన్‌లో కియా క్యారెన్స్ 7,847 యూనిట్లు వినియోగదారులు కొనుగోలు చేశారు.


2023 మేలో 6,367 యూనిట్లు విక్రయించారు. ఇటీవల కంపెనీ కొన్ని సాఫ్ట్‌వేర్ సంబంధిత సమస్యల కారణంగా కియా క్యారెన్స్ యూనిట్లను రీకాల్ చేసింది. వీటిలో 2022 సెప్టెంబరు నుంచి 2023 ఫిబ్రవరి వరకు తయారు అయిన 30,297 యూనిట్లు ఉన్నాయి.


కియా కార్లలో అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో కియా సొనెట్ రెండో స్థానంలో ఉంది. ఈ కారు 2023 జూన్‌లో 7,722 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2022 జూన్‌లో అమ్ముడుపోయిన 7,455 యూనిట్లతో పోలిస్తే సోనెట్ అమ్మకాలు నాలుగు శాతం పెరిగాయి. అదే 2023 మేతో పోలిస్తే దాని నెలవారీ అమ్మకాలు 8,251 యూనిట్ల నుంచి 6 శాతం తగ్గాయి. కియా ప్రస్తుతం సోనెట్ మిడ్ లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌ను టెస్ట్ చేస్తుంది. ఇది రాబోయే కొద్ది నెలల్లో లాంచ్ కానుంది.


భారీగా అమ్ముడుపోయిన సెల్టోస్ అమ్మకాలు
2022 జూన్‌లో విక్రయించిన 8,388 యూనిట్లతో పోలిస్తే 2023 జూన్‌లో కియా సెల్టోస్ అమ్మకాలు 57 శాతం తగ్గి 3,578 యూనిట్లకు పడిపోయాయి. 2023 మేలో జరిగిన 4,065 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే దీని నెలవారీ అమ్మకాలు కూడా 12 శాతం క్షీణించాయి.


కియా సెల్టోస్ భారతదేశంలో 2019లో లాంచ్ అయింది. దీన్ని కంపెనీ ఇంతవరకు అప్‌గ్రేడ్ చేయలేదు. ఇప్పుడు 2023 సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ త్వరలో లాంచ్ కానుంది. ఇది మరిన్ని భద్రతా ఫీచర్లు, సౌకర్యాలతో మార్కెట్లోకి రానుంది. మరింత శక్తివంతమైన ఇంజిన్‌ను ఫేస్ లిఫ్ట్ మోడల్ పొందుతుంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, ఎంజీ ఆస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లకు పోటీగా ఈ కారు ఉండనుంది. అలాగే 2020 నుంచి కియా సొనెట్‌లో కూడా కంపెనీ ఎటువంటి మార్పు చేయలేదు. దీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా త్వరలో  మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial