Thalapathy Vijay: తమిళ హీరో దళపతి విజయ్ మంచి స్పీడు మీదున్నాడు. ఈ సంవత్సరం జనవరిలో సంక్రాంతి పండగకు ‘వారిసు (తెలుగులో వారసుడు)’తో పలకరించిన విజయ్... దసరాకు మళ్లీ ‘లియో’తో బాక్సాఫీస్ బరిలో దిగనున్నాడు. ‘లియో’ సినిమాకు సంబంధించి విజయ్ షూటింగ్ పార్ట్ కూడా పూర్తయిపోయింది. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా పోస్టు ద్వారా ప్రకటించారు.


ఈ సంవత్సరం జనవరిలో ‘లియో’ షూటింగ్ ప్రారంభం అయింది. అప్‌డేట్స్‌ను ఫిబ్రవరి నుంచి అందించారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టులో హీరో పోర్షన్‌ను లోకేష్ కనగరాజ్ పూర్తి చేయడం విశేషం. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ రికార్డు రేటుతో క్లోజ్ అయింది. థియేటర్ మీద రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు కలెక్షన్లను ఇది సాధించగలదని అంచనా. పాజిటివ్ టాక్ వస్తే 2.0 రికార్డును (రూ.810 కోట్లు) ‘లియో’ బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.


వేగంగా సినిమాలు చేయడం, అదే సమయంలో క్వాలిటీ తగ్గకుండా చూసుకోవడం, ప్రతి సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ పోవడంలో విజయ్ దిట్ట. 2022 సమ్మర్‌కు ‘బీస్ట్’గా వచ్చిన విజయ్... కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే 2023 సంక్రాంతికి ‘వారిసు’తో రెడీ అయిపోయారు. మరో తొమ్మిది నెలల్లోనే మోస్ట్ అవైటెడ్ సినిమా ‘లియో’ను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.


విజయ్ తన తర్వాతి సినిమాను ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఆగస్టు నుంచి ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం సమ్మర్ బరిలో విజయ్, వెంకట్ ప్రభు నిలవనుందని తెలుస్తోంది. అదే నిజమైతే ‘లియో’ విడుదల అయిన ఆరు నెలల్లోనే మరో సినిమాను విజయ్ ఆడియన్స్ ముందుకు తెచ్చినట్లు అవుతుంది.


కాంబినేషన్ కోసం చూసుకోకుండా అందుబాటులో ఉన్న దర్శకుల్లో మంచి ఆప్షన్లు ఎంచుకుంటూ ముందుకు సాగడం కారణంగానే ఇది సాధ్యం అవుతుంది. వెంకట్ ప్రభు సినిమా తర్వాత విజయ్ మూడేళ్లు సినిమాలకు గ్యాప్ ఇస్తాడని, రాజకీయాల్లో ఎంట్రీ ఉండనుందని తెలుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి.


ఇక లియో విషయానికి వస్తే... ప్రస్తుతం మనదేశంలోనే మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇది ఒకటి. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంజయ్ దత్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ మీనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


‘లియో’ నుంచి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘నా రెడీ’ పాట సూపర్ హిట్ అయింది. యూట్యూబ్‌లో ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ప్రస్తుతం ఈ పాటే ట్రెండింగ్‌లో ఉంది. అనిరుథ్ స్వరపరిచిన మాస్ బీట్... సాంగ్‌ను ఇన్‌స్టంట్ హిట్ చేసింది. సినిమా విడుదలకు మూడు నెలలకు ముందే ఫస్ట్ కాపీని రెడీ చేసుకుని దేశవ్యాప్తంగా పబ్లిసిటీ అదరగొట్టాలనేది టీమ్ ప్లాన్. కాబట్టి త్వరలో ‘లియో’ టీమ్ నుంచి మరింత కంటెంట్‌ను మనం చూడవచ్చు.


దసరా పండుగకు తెలుగులో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’లతో ‘లియో’ పోటీ పడనుంది. మరి ఈ త్రిముఖ పోటీలో ‘లియో’ నిలబడగలదా? అనేది తెలియాలంటే ఇంకో మూడు నెలలు ఆగాలి.