స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రాజయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కడియం శ్రీహరి తప్పుబట్టారు. రాజయ్యలో మార్పు వస్తుందని తాను ఆశించానని, కానీ ఆయనలో ఏ మార్పూ రాలేదని కడియం అన్నారు. రాజయ్య స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. భారత దేశ కుటుంబ వ్యవస్థను అవమానపర్చేలా రాజయ్య ప్రకటన ఉందని విమర్శించారు. భేషరతుగా మహిళామణులకు క్షమాపణలు చెప్పాలని, ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. 


డాక్టర్ చదువు చదివి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ‘‘నా తల్లి బీసీ, నా తండ్రి ఎస్సీ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నేను ఎస్సీ అవుతా. తండ్రి కులమే పిల్లలకు వస్తుందని సుప్రీంకోర్టు తీర్పులో ఉంది. నా తర్వాత నా బిడ్డ ఎస్సీనే అవుతుంది. నా బిడ్డ మతాంతర వివాహం చేసుకుంటే, నా బిడ్డకు పుట్టే పిల్లలకు ఆ తండ్రి కులం వర్తిస్తుంది. కానీ, నా బిడ్డకు నా కులమే ఉంటుంది. ఈ మాత్రం న్యాయసూత్రాలు రాజయ్యకు తెలియవా?’’ అని కడియం శ్రీహరి మాట్లాడారు.


ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు వ్యాఖ్యలపైనా స్పందన


ఎన్‌కౌంటర్ ల స్పెషలిస్టు కడియం శ్రీహరి అని ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యానించడాన్ని కూడా కడియం తప్పుబట్టారు. తాను 2004 వరకూ ఎమ్మెల్యేగా ఉండగా జరిగిన ఎన్ కౌంటర్ల కంటే, 2004 తర్వాత రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎక్కువ ఎన్ కౌంటర్ లు జరిగాయని గుర్తు చేశారు. తనకు వేలాది కోట్ల ఆస్తి విదేశాల్లో ఉందని రాజయ్య చేసిన ఆరోపణలను కూడా కడియం శ్రీహరి ఖండించారు. తన వద్ద ఉన్న సమాచారం అంతా తీసుకురావాలని, తనకు నిజంగా వేల కోట్లు ఆస్తి ఉంటే అదంతా దళిత బిడ్డలకు పంచి పెట్టేస్తానని చెప్పారు. ఇందుకు తనకు వారం రోజుల సమయం ఇస్తున్నానని ఛాలెంజ్ విసిరారు.


రాజయ్య వ్యాఖ్యలు ఇవీ..
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నోసార్లు వారి బహిరంగంగా ప్రెస్ మీట్ లలో ఒకరిపై మరొకరు విమర్శలు, మాటల దాడులు చేసుకున్నారు. ఇటీవల రాజయ్య మాట్లాడుతూ.. కడియం శ్రీహరి సామాజికవర్గానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి ఎస్సీ అవునో కాదో ఆయనే నిరూపించుకోవాలని అన్నారు. అసలు కడియం శ్రీహరి ఎస్సీనే కాదని, ఆయన పద్మశాలి అని అన్నారు. పిల్లల విషయంలో తల్లి అనేది సత్యం అని, తండ్రి అనేది అపోహ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కడియం ఒక బ్లాక్ మెయిలర్ అని, చంద్రబాబు వెన్నుపోటు కథలో కడియం శ్రీహరి కీలక పాత్ర అని ఆరోపించారు. 


మంత్రిగా ఉన్నప్పుడు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి కడియం సింగపూర్, మలేషియాలో ఆస్తులు సంపాదించారని రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలం హిమ్మత్ నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.