కొంతమంది వినియోగదారులు కొత్త కారును కొనుగోలు చేయడానికి ముందు, కొద్ది రోజులు డ్రైవింగ్ పట్ల అవగాహన పెంచుకునేందుకు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తారు. మరికొంత మంది వినియోగదారులు బడ్జెట్ పరిమితుల కారణంగా పాత కారును తీసుకుంటారు. కొంత మంది వినియోగదారులు బ్రాండ్-న్యూ మోడల్‌ను కలిగి ఉండటం కంటే ఉపయోగించిన కారును కొనుగోలు చేయడం ఉత్తమమని నమ్ముతారు. ఏది ఏమైనప్పటికీ, కారు అనేది చాలా మంది ఎంతో ఇష్టంతో కొనుగోలు చేస్తారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంటికి తెచ్చుకుంటారు. అందుకే, సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..   


1. వెంటనే జడ్జ్ చేయకండి


మీకు కారు కొనాలనే కుతూహం ఉండవచ్చు. మార్కెట్లో ఎన్నో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఎంత ఆకర్షణీయమైన కారు అయినా, చూసిన వెంటనే ఓ నిర్ణయానికి రాకండి. మెరిసేదంతా బంగారం కాదు. మీరు మెరిసే పాత కారును కావాలని పట్టుబట్టకండి.


2. కారు కండీషన్ పూర్తిగా తనిఖీ చేయండి


మీకు కారు గురించిన పూర్తి అంశాల మీద అవగాహన ఉంటే మీరే చెక్ చేసుకోవచ్చు. లేదంటే, కార్ల గురించి బాగా తెలిసిన వ్యక్తిని తీసుకెళ్లి పరిశీలించండి. కారును పైనా, లోపల పూర్తిగా పరిశీలించండి. పెయింట్, తుప్పు పట్టడం సహా అన్ని విషయాలను తనిఖీ చేయాలి. క్యాబిన్ లోపల, అప్హోల్స్టరీ, మ్యూజిక్ సిస్టమ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్వాలిటీ, పని విధానం, సీట్లకు సంబంధించిన నాణ్యత పరిశీలించండి. వేర్ అండ్ టియర్, వీల్ అలైన్‌మెంట్ కోసం టైర్ పరిస్థితులను జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఇంజిన్ లీక్‌లు, తుప్పు,  పగిలిన ట్యూబ్‌ లు ఉన్నాయేమో చూడండి.  అలాగే, డిప్ స్టిక్ ఉపయోగించి ఆయిల్ ప్రసరణను పరిశీలించండి.


3. టెస్ట్ డ్రైవ్ చేయండి  


టెస్ట్ డ్రైవ్ లేకుండా, కారును కొనుగోలు చేయకూడదు. అది కొత్తదైనా, సెకెండ్ హ్యాండ్ అయినా. ఇంజిన్ సహా ఇతర అంశాలను గమనించేందుకు టెస్ట్ డ్రైవ్‌ చేయాలి. మీరు ఒకే టెస్ట్ డ్రైవ్‌తో సంతృప్తి చెందకపోతే వేరే కారును పరిశీలించడండి. అలాగే, మీరు కారు గురించి బాగా తెలిసిన వ్యక్తిని టెస్ట్ డ్రైవ్‌ కు తీసుకెళ్లడం ఉత్తమం.  


4. రికార్డులను తనిఖీ చేయండి


కారు మెయింటెనెన్స్ రికార్డులను కచ్చితంగా పరిశీలించాయిలి. వీటి ద్వారా వాహనం ఎలాంటి సమస్యలను ఎదుర్కొందో  అర్థం చేసుకోవచ్చు. కొంతమంది కారు యజమానులు సర్వీసింగ్ రికార్డులను చక్కగా మెయింటెయిన్ చేస్తారు. వాటికి సంబంధించిన రసీదులను ఉంచుతారు. ఏది ఏమైనా, మీరు కొనుగోలు చేసే ముందు దాని హిస్టరీని చెక్ చేయడం చాలా అవసరం.


5. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పరిశీలించండి


డీల్‌ను ఖరారు చేసే ముందు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను పరిశీలించాలి.  RC యజమాని పేరు, ఇంజిన్, ఛాసిస్ నంబర్ లాంటి  వివరాలను కలిగి ఉంటుంది. అలాగే, RC నిజమైనదో, కాదో చెక్ చేసుకోండి.  అది డూప్లికేట్ అయితే, DRCగా గుర్తు ఉంటుంది. అప్పుడు DRC స్టేటస్ గురించి విక్రేతతో మాట్లాడాలి. అలాగే, కొనుగోలు ఇన్‌వాయిస్, ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి పత్రాలను తనిఖీ చేయండి. ఫారం 35,  ఫైనాన్సింగ్ కంపెనీ  NOC కూడా కీలకమైనవని గుర్తుంచుకోవాలి. ఈ అంశాలన్నీ మీకు నచ్చితేనే కారు కొనుగోలు చేయాలి.


Read Also: వచ్చేస్తున్నాయ్ కొత్త కార్లు - రూ.15 లక్షలలోపు రాబోయే 4 SUVలు ఇవే!