Fastag Auto Debit System: ఫాస్టాగ్ వినియోగదారులు బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌ ఫాస్టాగ్ అకౌంట్‌లో అమౌంట్‌ క్రెడిట్‌ అయ్యే ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల అత్యవసర సమయాల్లో సమయం ఆదా అవ్వడమే కాకుండా ప్రతీసారీ మాన్యువల్ టాప్-అప్‌ చేసుకునే టెన్షన్‌ తొలగిపోనుంది. ఈ ఆప్షన్‌ని ఎంచుకోవడం ద్వారా మీ ఫాస్టాగ్ అకౌంట్‌లో తగినంత బ్యాలెన్స్ లేకపోతే మీ అకౌంట్‌కి లింక్ చేసుకున్న బ్యాంక్ ఖాతా నుంచి ఫాస్టాగ్ అకౌంట్‌లో క్రెడిట్‌ కానుంది. ఆ వివరాలు మీ కోసం..


ఆటోమేటిక్ రీఛార్జ్ ఆప్షన్‌
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఫాస్టాగ్ వినియోగదారులు ఇ-మాండేట్‌ని యాక్టివేట్ చేయవచ్చు. దీని ద్వారా ఫాస్టాగ్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు మీ బ్యాంక్ ఖాతాల నుంచి ఆటోమేటిక్ మనీ డిడక్షన్‌ కానుంది. ఈ ఫీచర్ టోల్ ఫీజ్‌ చెల్లింపులను సులభతరం చేయనుంది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ లేదా రీఛార్జ్‌ సమస్య చేసుకునే ఆందోళన లేకుండా చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలోని 99 శాతం వాహనదారులు జాతీయ రహదారులపై టోల్ చెల్లింపుల కోసం ఫాస్టాగ్ ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు ఇప్పటికీ తమ ఫాస్టాగ్‌ అకౌంట్‌లలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో రెట్టింపు ఫీజు చెల్లిస్తున్నారు. ఈ ఆటో-రీఛార్జ్ ఆప్షన్‌ని ఎంచుకోవడం ద్వారా రీఛార్జ్‌ సమస్యకు చెక్‌పడనుంది.


మాన్యువల్ రీఛార్జ్
అయితే ఈ ఆటో పేమెంట్‌ అనేది తప్పనిసరి కాదు. మాన్యువల్ రీఛార్జ్‌ని ఇష్టపడే వినియోగదారులు అలానే కొనసాగించవచ్చు. ఆటో-రీఛార్జ్ ఫీచర్ అనేది ఆప్షనల్‌ కాబట్టి ఫాస్టాగ్‌ వినియోగదారులు ఆందోళన చచెందాల్సిన పనిలేదు. ఈ ఆప్షన్‌ ఎంచుకున్న వారు తమ ఫాస్టాగ్‌ బ్యాలెన్స్ ఉదాహరణకు రూ. 300 కంటే తక్కువగా ఉన్న సందర్భాల్లో మీరు సెట్‌ చేసుకున్న అమౌంట్‌ (మీకు నచ్చిన అమౌంట్‌) ఆటోమేటిక్‌గా టాప్అప్‌ అవుతుంది.


ఫాస్టాగ్‌లో తక్కువ బ్యాలెన్స్‌ వల్ల కలిగే సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దీనికి పరిష్కారంగా ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. వాహనదారులు రెట్టింపు ఫీజులు చెల్లించే సందర్భాలను తగ్గించడం, రీఛార్జ్‌ సమయాల్లో ఇతర సమస్యలను మెరుగుపరచడం దీని లక్ష్యం. చాలా మంది అత్యవసర పరిస్థితుల కారణంగా లేదా రీఛార్జ్ చేయడంలో మతిమరుపు కారణంగా టోల్ చెల్లింపుల సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది ఇతర వాహనదారులకు కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది.

ఈ ఆటో-రీఛార్జ్ ఫీచర్‌తో పాటు, త్వరలో భారతదేశంలో GPS ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టనున్నారు. ఈ సిస్టమ్‌ ద్వారా కేవలం ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టడం ద్వారా వాహనదారులకు ఇబ్బందులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే
జీపీఎస్‌ ఆధారిత టోల్‌ సిస్టమ్‌ కోసం ప్రత్యేక మెకానిజమ్‌ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక క్యూ లైన్‌, ప్రతీ వాహనంలో జీపీఎస్‌ చిప్‌, ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్స్‌ వద్ద ప్రత్యేక సిస్టమన్‌ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది 2030 నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఫాస్టాగ్‌ సిస్టమ్‌తోనే టోల్‌ వసూలు చేయనున్నారు. భారతదేశంలోని రహదారి వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులకు గురి అవ్వకుండా సర్వీస్‌ని అందించేలా పనిచేయాలని గతంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. రోడ్లు సరిగ్గా లేకపోతే టోల్‌ కూడా వసూలు చేయవద్దని ఆయన బాంబ్‌ కూడా పేల్చారు.