Team india squad for ICC Women's T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్‌(Women's T20 World Cup 2024) కోసం భారత జట్టు(Team India) ను ప్రకటించారు. హర్మన్‌ ప్రీత్‌(Harmanpreet) సారధ్యంలో జట్టు బరిలోకి దిగనుంది. యూఏఈ వేదికగా అక్టోబర్‌లో జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్‌ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ(bcci) ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్  కెప్టెన్‌గా స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా టీం ఉండనుంది. 
 

తొలి టైటిల్‌ సాధించేనా..?

    హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు తొలి టీ 20 ప్రపంచకప్ టైటిల్‌ను సాధించాలని పట్టుదలగా ఉంది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని పురుషుల జట్టు టీ 20 ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించి తమ కలను నెరవేర్చుకుంది. ఇక మిగిలి ఉంది మహిళల జట్టు తొలిసారి టీ 20 ప్రపంచకప్‌ను గెలవడమే. దీనికోసం మహిళల జట్టు... పురుషుల జట్టును ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటోంది. అక్టోబర్‌లో జరగనున్న T20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్.. భారత్‌కు తొలి మహిళల టీ 20 ప్రపంచకప్‌ను అందించాలని చూస్తోంది. గత దశాబ్ద కాలంగా ఐసీసీ ఈవెంట్లలో భారత మహిళల జట్టు విఫలమవుతోంది. 2017లో జరిగిన ICC మహిళల ప్రపంచకప్, 2020లో జరిగిన ICC మహిళల T20 ప్రపంచ కప్ రెండింటిలోనూ భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. టైటిల్‌ సాధిస్తుందని భారీగా అంచనాలు ఉన్నా... తుది మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో ఓటమితో ఐసీసీ ట్రోఫీ కల కలగానే మిగిలిపోయింది. భారత పురుషుల జట్టు కూడా దశాబ్దాల నిరీక్షణకు తెరదించి 2024 టీ 20 ప్రపంచకప్‌ను సాధించింది. ఇప్పుడు మహిళల జట్టు కూడా అదే చేయాలని చూస్తోంది. 



 

రోహిత్‌లా హర్మన్‌..

రోహిత్‌ శర్మ టీ 20 ప్రపంచకప్‌లో జట్టును సమర్థంగా నడిపించాడు, ఇప్పుడు ఇదే పని హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా చేయాల్సి ఉంది. మహిళల టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టును ప్రకటించిన రోజున హర్మన్‌ప్రీత్ కీలక వ్యాఖ్యలు చేసింది. "తాము నిజంగా పురుషుల జట్టు నుంచి స్ఫూర్తి పొందుతాం. వారు ఈ సంవత్సరం T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నారు. దీని కోసం టీమిండియా మెన్స్‌ టీం చాలా కష్టపడింది" అని హర్మన్‌ప్రీత్ అన్నారు. తాము కూడా ఇప్పుడు అదే దారిలో పయనించి టీ 20 ప్రపంచకప్‌ గెలుస్తామని స్పష్టం చేశారు. తాము ఈ మెగా టోర్నీ కోసం చాలా కష్టపడుతున్నామని.. ఈ ఏడాది మరో కప్‌ అందిస్తామని ధీమా వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంకతో కలిసి రాబోయే టోర్నమెంట్‌లో భారత్ గ్రూప్ Aలో ఉంది. మొదటి రెండు జట్లు మాత్రమే నాకౌట్‌కు చేరుకుంటాయి. భారత్‌ ఫైనల్‌ చేరాలంటే ఈసారి అత్యుత్తమ ప్రదర్శన చేయాలి. T20 ప్రపంచ కప్ 2024 అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది, అక్టోబర్ 4న దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.  అక్టోబర్‌ ఆరున పాకిస్తాన్‌తో, అక్టోబర్‌ 9న శ్రీలంకతో.. అక్టోబర్‌ 13న ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. 

 

భారత జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్  కెప్టెన్‌గా స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా టీం ఉండనుంది. షఫాలీ, దీప్తి శర్మ, రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్. ట్రావెలింగ్ రిజర్వ్‌: ఉమా ఛెత్రి, తనుజా కన్వర్, సైమా ఠాకూర్.