EV Sales Report For June 2025 In India: భారతదేశంలో, పెట్రోల్ & డీజిల్ కార్ల స్థానాన్ని ఎలక్ట్రిక్ కార్లు క్రమంగా భర్తీ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది, డబ్బు ఆదా చేస్తున్న EVలను ప్రజలు ఇష్టపడుతున్నారు. గత నెల (జూన్‌ 2025) అమ్మకాల నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా, MG & మహీంద్రా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి కంపెనీ వేర్వేరు వ్యూహాలను అవలంబించింది & తమ మోడళ్ల విషయంలో బాగా పని చేసింది. రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ఈ గణాంకాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది.

Continues below advertisement


ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొంటున్నారు? 
జూన్ 2025లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల లెక్కలను పరిశీలిస్తే, టాటా మోటార్స్‌ (Tata Motors) అత్యధికంగా 4,604 యూనిట్ల ఎలక్ట్రిక్‌ కార్లను అమ్మింది, లిస్ట్‌లో మొదటి స్థానం దక్కించుకుంది. అయితే మే 2025లో అమ్మిన 4,768 యూనిట్లతో పోలిస్తే ఈసారి సేల్స్‌ కొంచెం తగ్గాయి.


జూన్‌ నెలలో 4,016 యూనిట్ల అమ్మకాలతో ఎంజీ మోటార్స్‌ (MG Motors) రెండో స్థానంలోకి వచ్చింది. అదే నెలలో మహీంద్రా ఎలక్ట్రిక్‌ (Mahindra Electric) 3,056 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది, మే నెలలో 2,836 యూనిట్లు అమ్ముడయ్యాయి. జూన్‌లో ఈ కంపెనీ మూడో స్థానానికి చేరుకుంది & దీని పనితీరు ఎప్పటికప్పుడు మెరుగుపడుతోంది. జూన్‌ 2025లో హ్యుందాయ్ (Hyundai) 515 యూనిట్లను, బీవైడీ (BYD) 417 యూనిట్లను & బీఎమ్‌డబ్ల్యూ ‍‌(BMW) 215 యూనిట్లను విక్రయించాయి.


టాటా EV ఇప్పటికీ నంబర్ 1 స్థానంలో ఉందని ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే, MG నెమ్మదిగా దానికి దగ్గరవుతోంది. మహీంద్రా కూడా క్రమంగా తన పట్టును బలోపేతం చేసుకుంటోంది.


ఏ బ్రాండ్‌లో ఏ మోడల్ కీలక పాత్ర పోషించింది?


టాటా EVs: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ రేంజ్‌లో ఉన్న టియాగో EV, టాటా పంచ్ EV & హారియర్ EV వంటి మోడళ్లు పెద్ద పాత్ర పోషించాయి. ముఖ్యంగా, టియాగో EV & పంచ్ EV అమ్మకాలు టాటా నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకోవడానికి దోహదపడ్డాయి.


MG మోటార్స్: విండ్‌సర్ ప్రో మోడల్ MGకి గేమ్-ఛేంజర్‌గా మారింది. ఈ కారు దాని స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లు & అందుబాటు ధర కారణంగా కస్టమర్లలో బాగా పాపులర్‌ అయింది & కంపెనీ అమ్మకాలు స్థిరంగా కొనసాగడానికి సాయపడింది.


మహీంద్రా ఎలక్ట్రిక్: మహీంద్రా ప్రవేశపెట్టిన BE 6 & XUV 9e వంటి ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు వినియోగదారుల ఎంపికగా మారుతున్నాయి. ఈ మోడళ్లకు నిరంతరం పెరుగుతున్న డిమాండ్, మహీంద్రా క్రమంగా EV విభాగంలో పట్టు సాధిస్తోందని చూపిస్తుంది.


భారతదేశంలో EV అమ్మకాలు ఎందుకు పెరుగుతున్నాయి?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడానికి అనేక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అన్నింటిలో మొదటిది - పెట్రోల్ & డీజిల్ అధిక ధరలు. సాంప్రదాయ ఇంధన ధరల భారం ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లిస్తోంది. ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనగోలు చేసేలా ప్రేరేపిస్తున్నాయి.


పర్యావరణం పట్ల అవగాహన పెరగడం & అందుబాటు ధరల్లో లాంగ్‌ రేంజ్‌ మోడళ్ల రాక కారణంగానూ ఎలక్ట్రిక్ వాహనాలు కొనే ధోరణి పెరిగింది. సాంప్రదాయ ఇంధనంతో నడిచే కార్ల కంటే EVల అమ్మకాలు ఇప్పటికీ తక్కువగా ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా EV మార్కెట్ పెరిగిన విధానం భవిష్యత్తుకు సానుకూల సంకేతాలను ఇస్తోంది.