ఎండాకాలం పీక్‌కు చేరుకునే కొద్దీ మనదేశంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతాయి. ఈ ఉష్ణోగ్రతల కారణంగా మనం రోజువారీ ఉపయోగించే ఉపకరణాల్లో చాలా వేడెక్కుతాయి. మనం ఉపయోగించే ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ ఇలా అన్నిటికీ ఆ సమస్య వస్తుంది. ఇది కార్లకు కూడా తలెత్తుతుంది. ఒకవేళ కారు ఓవర్ హీట్ అయితే దాని కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోకపోతే కారు బ్రేక్‌డౌన్‌కి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
1. వెంటనే ఆపేయండి
కారు హీట్ అవుతుందని మీకు అనిపిస్తే వెంటనే కారు ఆపేసి రోడ్డు పక్కన సేఫ్ అయిన ప్రదేశంలో పార్క్ చేయండి. ఇంజిన్ వేడి తగ్గే దాకా కారును తిరిగి తీయకండి. ఎందుకంటే దీని కారణంగా ఇంజిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కుదిరితే కారును నీడలో ఆపండి.
2. ఇంజిన్ ఆపండి
ఒకసారి పక్కకు ఆపాక ఇంజిన్ ఆపేయండి. దీని కారణంగా కారు వేగంగా చల్లబడుతుంది. ఇంజిన్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే బోనెట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించకండి. కొన్ని నిమిషాలు ఆగి కూలింగ్ సిస్టం ఉష్ణోగ్రత తగ్గాక అప్పుడు ఓపెన్ చేయండి.
3. కూలెంట్ లెవల్ చెక్ చేయండి
ఇంజిన్ కూల్ అయ్యక కూలెంట్ లెవల్‌ను చెక్ చేయండి. కూలెంట్ రిజర్వాయర్ ట్యాంక్ లెవల్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. కారు వేడిగా ఉన్నప్పుడు రేడియేటర్ క్యాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించకండి. ఒకవేళ అలా చేస్తే కూలెంట్ మీ మీదకు చిమ్మే అవకాశం ఉంది. కూలెంట్ లెవల్ తక్కువగా ఉంటే దాన్ని వెంటనే నింపాలి. కూలెంట్ అందుబాటులో లేకపోతే తాత్కాలికంగా నీటిని ఉపయోగించవచ్చు. అయితే చల్లటి నీరు మాత్రం పోయకండి. ఎందుకంటే చల్లటి నీరు వేడిగా ఉండే ఇంజిన్‌లో క్రాక్స్ తీసుకొచ్చే ప్రమాదం ఉంది.
4. లీకులు ఉన్నాయేమో చూడండి
కూలెంట్ లెవల్ తక్కువగా ఉంటే, కూలింగ్ సిస్టంలో ఏవైనా లీక్స్ ఉన్నాయేమో చూడండి. రేడియేటర్, హోసెస్ లేదా వాటర్ పంప్‌ల్లో ఏదైనా లీకైజీ ఉందేమో జాగ్రత్తగా చెక్ చేయండి. ఒకవేళ లీక్ ఏమైనా ఉంటే వెంటనే దాన్ని రిపేర్ చేయండి.
5. తెలియకపోతే తల దూర్చకండి
కారులో తలెత్తిన సమస్యను సరిదిద్దడం మీ వల్ల కాకపోతే, మరీ ఎక్కువగా ప్రయత్నించకండి. వెంటనే రోడ్ సైడ్ అసిస్టెన్స్ లేదా మెకానిక్‌కు కాల్ చేయండి. ఇంజిన్ వేడి తగ్గకపోతే కారును నడపడానికి తిరిగి ప్రయత్నించకండి. మెకానిక్ లేదా సర్వీస్ లొకేషన్ దగ్గరలో ఉన్నప్పటికీ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లకండి. ఓవర్ హీట్ అయిన కారును డ్రైవ్ చేస్తే ఇంజిన్ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంజిన్ సీజ్ కూడా కావచ్చు.
ప్రస్తుతం మనదేశంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలను తాకుతుంది. కాబట్టి కార్లు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు టెంపరేచర్ చూసుకుంటూ ఉండటం మంచిది. ఓవర్ హీటింగ్ కారణంగా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టెప్స్ ఫాలో అయి సేఫ్‌గా ఉండండి. ఇలాంటి మరిన్ని ఉపయోగపడే టిప్స్, లేటెస్ట్ న్యూస్, అప్‌డేట్స్ కోసం ఏబీపీ దేశం యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Read Also: దేశీయ మార్కెట్లోకి సరికొత్త BMW X1 లాంచ్, ధర రూ.45.90 లక్షల నుంచి షురూ!