లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW సరికొత్త X1 కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ. 45.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ నూతన  SUV  రెండు గ్రేడ్‌లలో అందుబాటులోకి రాబోతోంది. BMW X1 sDrive18i xLine (పెట్రోల్) తో పాటు BMW X1 sDrive18d M స్పోర్ట్ (డీజిల్) వెర్షన్ లో వినియోగదారుల ముందుకు రానుంది. ఈ నూతన కారును BMW చెన్నై ఫ్యాక్టరీలో స్థానికంగా తయారు చేశారు.  






BMW X1 ప్రత్యేకతలు


BMW X1 కారు గత మోడల్ తో పోల్చితే కాస్త పెద్దగా ఉంది.  ఫ్రంట్ ఫాసియా స్లిమ్ LED హెడ్‌ లైట్లను కలిగి ఉంది. పెద్ద సైజులో చతురస్రాకారపు గ్రిల్‌ను కలిగి ఉంది.  స్క్వేర్ వీల్ ఆర్చ్ డిజైన్, లాంగ్  రూఫ్‌లైన్, ఫ్లాట్ రూఫ్ రెయిల్స్,  3D LED టైల్‌ లైట్లు, స్లిమ్ టెయిల్‌ గేట్ విండో, 18-అంగుళాల లైట్-అల్లాయ్ వీల్స్తో స్టైలిష్ గా కనిపిస్తుంది. అంతేకాదు, హై  బీమ్ అసిస్టెంట్‌తో కూడిన అడాప్టివ్ LED హెడ్‌లైట్లు, ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్‌తో కూడిన BMW లైవ్ కాక్‌పిట్ ప్లస్, BMW కనెక్టెడ్ డ్రైవ్, BMW కర్వ్డ్ డిస్ ప్లే, రిమోట్ ఫంక్షన్‌లతో కూడిన My BMW యాప్, అంబెట్ లాంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.  లైటింగ్, కంఫర్ట్ యాక్సెస్‌తో కూడిన డిజిటల్ కీ ప్లస్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ లగ్జరీ, పార్కింగ్, రివర్సింగ్ అసిస్టెంట్, ఆటోమేటిక్ 2 జోన్ A/C, యాక్టివ్ స్పోర్ట్స్  సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌ రూఫ్, 12-స్పీకర్ హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ ను కలిగి ఉంది.ఈ  BMW X1 ఆల్పైన్ వైట్, స్పేస్ సిల్వర్, ఫైటోనిక్ బ్లూ, బ్లాక్ సఫైర్, M పోర్టిమావో బ్లూ అనే ఐదు రంగుల్లో ఈ కారు అందుబాటులోకి రానుంది.  


BMW X1 ఇంజిన్ ప్రత్యేకతలు


ఇక ఇంజిన్ గురించి పరిశీలిస్తే,  BMW X1 2.0L 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ 146 bhp గరిష్ట శక్తిని, 360 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8.9 సెకన్లలో 0-100 kmph వేగాన్ని  అందుకుంటుంది.  20.37 kmpl మైలేజీని అందించడం విశేషం. అటు పెట్రోల్ వేరియంట్‌లు 1.5L 3-సిలిండర్ ట్యూరోచార్జ్డ్ మోటారు నుంచి శక్తిని పొందుతాయి. ఇది 132 bhp, 230 Nm శక్తిని విడుదల చేస్తుంది. 10 సెకెన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంది. 16.3 kmpl మైలేజ్ అందిస్తుంది.  రెండు ఇంజన్లు  7-స్పీడ్ స్టెప్‌ ట్రానిక్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌తో అనుసంధానించబడి ఉన్నాయి. 


సరికొత్త BMW X1 ధర ఎంతంటే?


BMW X1 sDrive18i xLine (పెట్రోల్) వెర్షన్ ధర రూ. 45.90 లక్షలు(ఎక్స్ షోరూమ్) కాగా, BMW X1 sDrive18d M స్పోర్ట్ (డీజిల్) ధర  రూ. 47.90 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.  BMW X1 బుకింగ్‌లు ఇప్పటికే కంపెనీ డీలర్స్ తో పాటు ఆన్‌ లైన్‌లో ప్రారంభమయ్యాయి. డీజిల్ వేరియంట్‌ల డెలివరీలు మార్చి నుంచి మొదలుకానున్నాయి. పెట్రోల్ వేరియంట్‌లు కాస్త ఆలస్యంగా  జూన్‌లో డెలివరీ చేయబడతాయని కంపెనీ వెల్లడించింది.


Read Also: సమ్మర్‌లో మీ కారును జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఈ టిప్స్ తప్పకుండా పాటించాల్సిందే!