నెల్లూరు రాజకీయాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ, ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నెల్లూరు రూరల్ లో ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్ చార్జ్ గా చేసింది వైసీపీ అధిష్టానం. వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇన్ చార్జ్ గా ప్రకటించింది. ఉదయగిరి విషయంలో వేచి చూస్తోంది. ఈ దశలో ఇప్పుడు నెల్లూరు జిల్లానుంచి ఓ కీలక నేత టీడీపీకి గుడ్ బై చెప్పి, వైసీపీలో చేరబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి తనయుడు, మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైసీపీలో చేరతారని తెలుస్తోంది.


బొమ్మిరెడ్డి కుటుంబం కాంగ్రెస్ కు విధేయతగా ఉంది. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత రాఘవేంద్రరెడ్డి జగన్ కి దగ్గరయ్యారు. వెంకటగిరి నియోజకవర్గ టికెట్ ఆశించారు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. తీరా ఎన్నికల సమయానికి వెంకటగిరి వైసీపీ టికెట్ ఆనం రామనారాయణ రెడ్డికి వెళ్లిపోవడంతో రాఘవేంద్ర రెడ్డి అలిగారు. ఆనంకి మద్దతు తెలపకుండా ఆయన టీడీపీలో చేరారు. అయినా టీడీపీనుంచి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ హామీ లభించలేదు. కేవలం వైసీపీ టికెట్ విషయంలో తనను మోసం చేశారనే కారణంతో ఆయన టీడీపీలో చేరారు. కొన్నాళ్లు యాక్టివ్ గానే ఉన్నా.. ఇటీవల టీడీపీ కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా లేరు. ఆత్మకూరు నియోజకవర్గానికి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారాయన. విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు కూడా ఆయనకు టీడీపీ నుంచి ఆనంతో పోటీ ఎదురైంది. ఆత్మకూరు టీడీపీ టికెట్ ఆనం రామనారాయణ రెడ్డికి ఖరారవుతుందన్న సందర్భంలో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మరోసారి పార్టీ మారబోతున్నారు. 


ఆత్మకూరు టీడీపీ నేత, మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి త్వరలోనే వైసీపీ కండువా కప్పేందుకు సిద్ధం అవుతోందట అధిష్టానం. బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డితో ఇప్పటికే చర్చలు జరిపారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన తనయుడు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న బొమ్మిరెడ్డిని వారిద్దరూ వైసీపీలోకి ఆహ్వానించారు. ఇటీవల ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. బొమ్మిరెడ్డి కుటుంబ అభిమానుల్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 


ఎమ్మెల్యే టికెట్ పై హామీ ఇస్తారా..?
బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి టార్గెట్ ఒక్కటే. ఎమ్మెల్యేగా పోటీ చేయడం. ఆయనకు పదే పదే ఎవరో ఒకరు అడ్డు తగులుతున్నారు. ఈ దశలో ఆయన మరోసారి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈసారయినా ఆయనకు టికెట్ హామీ ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పార్టీ ఇన్ చార్జ్ గా ప్రకటించినా చివరి నిమిషంలో ఆయనకు టికెట్ నిరాకరించే అవకాశముంది. ఆ స్థానంలో బొమ్మిరెడ్డికి అవకాశం ఇస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే అయినా టికెట్ హామీ ఇస్తే మాత్రం బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పార్టీ మారడం ఖాయం. అదే జరిగితే టీడీపీకి అది షాక్ అని చెప్పాలి. ఎన్నికలనాటికి ఇలాంటి కప్పదాట్లు సహజమే కాబట్టి.. అసలు బొమ్మిరెడ్డి చేరికతో వైసీపీ బలపడుతుందా, టీడీపీకి అది నష్టం చేకూరుస్తుందా అనేది ముందు ముందు తేలిపోతుంది.