New SUV Launches in India: ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లోని మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఈ కారు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందింది. దీని కారణంగా ఇప్పుడు ఇతర వాహన తయారీదారులు కూడా ఈ ఎస్‌యూవీతో పోటీ పడేందుకు రెడీ అవుతున్నాయి.
గత సంవత్సరం మారుతీ, టయోటా ఈ వాహనానికి పోటీగా ఇదే సెగ్మెంట్‌లో గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లను విడుదల చేశాయి. ఇవి కూడా భారీ సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయి. వీటితో పాటు సిట్రోయెన్ కూడా రాబోయే కొద్ది నెలల్లో దాని కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీని విడుదల చేయబోతోంది. దీనికి సీ3 ఎయిర్‌క్రాస్ అని పేరు పెట్టనున్నారు.
జపాన్ వాహన తయారీ సంస్థ హోండా కూడా తన ఎలివేట్ ఎస్‌యూవీని కూడా త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ రెండు ఎస్‌యూవీలు మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాక క్రెటా అమ్మకాలపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
హోండా ఎలివేట్ ఎలా ఉంటుంది?
హోండా తన ఎలివేట్ కోసం రూ. 21,000 ప్రారంభ మొత్తంతో బుకింగ్ ప్రారంభించింది. ఇది 2023 సెప్టెంబర్‌లో మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఈ ఎస్‌యూవీ నాలుగు వేర్వేరు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో మొదటి రెండు వేరియంట్‌ల్లో సన్‌రూఫ్‌ను అందించనున్నారు. హోండా ఎలివేట్‌లో 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 121 బీహెచ్‌పీ పవర్‌ని, 145 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కూడా పొందుతుంది.
ఈ ఎస్‌యూవీ మూడు డ్యూయల్ టోన్ షేడ్స్‌తో సహా వివిధ రంగులలో అందుబాటులో ఉంటుంది. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హోండా సెన్సింగ్ ఏడీఏఎస్ సూట్ ఫీచర్లను కూడా పొందుతుంది.
సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఇలా?
సిట్రోయెన్ సీఎంపీ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారును నిర్మించారు. ఇది మధ్యతరహా ఎస్‌యూవీ విభాగంలో మార్కెట్లోకి రానుంది. ఈ కారులో సీ3 హ్యాచ్‌బ్యాక్‌లో కనిపించే కొన్ని డిజైన్ ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్లు ఉండనున్నాయి. ఇది 5 సీటర్, 7 సీటర్ వంటి రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 511 లీటర్ల వరకు బూట్ స్పేస్‌ను ఈ కారు పొందుతుంది.
సీ3 ఎయిర్‌క్రాస్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 110 బీహెచ్‌పీ పవర్‌ని, 190 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఈ కారు పెయిర్ కానుంది. దీని ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తర్వాతి కాలంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 10.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెథెరెట్ అప్హోల్స్టరీ సహా మరిన్ని ఫీచర్లను పొందుతుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial