Byjus :  ఆర్థిక సంక్షోభంలో పడిన బైజూస్ సంస్థ.. కాస్ట్ కటింగ్ వైపు చూస్తోంది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంస్థ .. వేలాది మందిని ఉద్యోగాల నుంచి తప్పించింది. దీంతో ఆఫీసులు కూడా ఖాళీ చేస్తోంది.  బెంగళూరులోని తన కార్యాలయ స్థలాలను ఖాళీ చేస్తోంది. తద్వారా నిధులు మిగుల్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే పలు కార్యాలయాలను ఆ సంస్థ ఖాళీ చేసినట్లు తెలిసింది. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను వేరే కార్యాలయాల్లో సర్దుబాటు చేసింది. కొందరికి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని సూచించింది.


బెంగళూరులో కీలక కార్యాలయాలను మూసేసిన బైజూస్                                     


బెంగళూరులో బైజూస్‌కు మూడు ఆఫీసులు ఉన్నాయి.  కల్యాణి టెక్‌ పార్క్‌లో మగ్నోలియా, ఎబోనీ అనే రెండు బిల్డింగ్‌లను బైజూస్ గతంలో లీజుకు తీసుకుంది. ఇందులో మగ్నోలియా బిల్డింగ్‌ మొత్తాన్ని గత నెలలోనే బైజూస్‌ ఖాళీ చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే టెక్‌ పార్క్‌లో ఉన్న ఎబోనీ బిల్డింగ్‌కు అక్కడి ఉద్యోగులను తరలించింది. ఎబోనీ బిల్డింగ్‌లోనూ ఇప్పటికే కొంత స్థలాన్ని బైజూస్‌ ఖాళీ చేసిందని, ఆగస్టు కల్లా మొత్తం ఖాళీ చేసే అవకాశం ఉంది.


నెలకు రూ. మూడు కోట్లు ఆదా చేసుకునే లక్ష్యం                                                             


 ప్రెస్టీజ్‌ పార్కులోనూ కొంత భాగాన్ని ఖాళీ చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.   ఖాళీ చేసిన కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కొంతమందిని వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌, ప్రెస్టీజ్‌ టెక్‌ పార్కు, బనేఘట్ట మెయిన్‌ రోడ్డులోని ప్రధాన కార్యాలయాల్లో సర్దుబాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే కొంత మందికి లే ఆఫ్‌లు కూడా ఇచ్చారనిచెబుతున్నారు.  దేశవ్యాప్తంగా 30 లక్షల చదరుపు అడుగుల్లో బైజూస్‌కు కార్యాలయ స్థలం ఉందని, ఇందులో కల్యాణి టెక్‌పార్క్‌లోని 5.58 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని ఖాళీ చేయడం ద్వారా నెలకు రూ. 3 కోట్లు మేర ఆదా చేసుకోవాలన్నది కంపెనీ భావిస్తోంది.   


ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో బైజూస్                                              


తీవ్రమైన కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు బయటపడటంతో కంపెనీ విశ్వసనీయత తగ్గిపోతోంది. ఇటీవల బోర్డు నుంచి ఆడిటర్ డెలాయిట్ తో పాటు  ముగ్గురు బోర్డు సభ్యుల రాజీనామా చేశారు. ఇప్పటికే  FY21 ఆర్థిక ఫలితాలను  దాఖలు చేయడంలో 18 నెలల జాప్యం జరిగింది. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళన  పెంచుతోంది.  పెట్టుబడిదారుల నుండి సుమారు $5 బిలియన్ల నిధులను సేకరించిన బైజూ తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పుడుతోంది. కంపనీ విలువ   $22 బిలియన్ల నుండి $5.1 బిలియన్లకు తగ్గిపోయింది. దీంతో మరిన్నికష్టాలు ప్రారంభమయ్యాయి.