తెలంగాణలో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వీఆర్ఏలకు (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రెవెన్యూ వ్యవస్థలో మార్పుల కారణంగా వీరిని ప్రభుత్వం పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న అందరినీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న మొత్తం 20,555 మంది వీఆర్‌ఏలను సూపర్‌ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతికుమారి సోమవారం (జూలై 24) వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సంబంధించి ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని వీఆర్‌ఏల జేఏసీ నేతలకు సీఎం కేసీఆర్ అందజేశారు. దాంతో రాష్ట్రంలోని వీఆర్‌ఏలు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


రాష్ట్రంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు తదితర అంశాలపై ఆదివారం (జూలై 23) సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. నీరటి, మసూరు, లషర్‌ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుచుకుంటున్న, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా ఉన్న వీఆర్‌ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ఈ సమావేశంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను నేడు విడుదల చేశారు.