Car Sales Report December 2023: భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌. మనదేశంలో సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌, ముఖ్యంగా 3.8 నుంచి నాలుగు మీటర్ల మధ్య ఉన్న ఎస్‌‌యూవీలు మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. 2023 డిసెంబర్ నెలలో ఈ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీల సేల్స్ గణాంకాలు కస్టమర్ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి. ఈరోజు మనం గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ల గురించి తెలుసుకుందాం.


నెక్సాన్, పంచ్ ముందంజలో...
టాటా నెక్సాన్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఏకంగా 15,284 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇది 26.81 శాతం గణనీయమైన వృద్ధిని సాధించింది. టాటా మోటార్స్ లాంచ్ చేసిన మరో కారు పంచ్ 13,787 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ కారు సంవత్సరానికి 30.24 శాతం వృద్ధిని నమోదు చేసింది.


సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో నిరంతరం ముందంజలో ఉన్న మారుతి బ్రెజ్జా 12,844 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. 2022 డిసెంబర్‌తో 14.68 శాతం పెరుగుదల నమోదైంది. దీని తరువాత హ్యుందాయ్ వెన్యూ వార్షికంగా 25.32 శాతం పెరుగుదలను కనబరిచింది. 10,383 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం ద్వారా నాలుగో స్థానాన్ని సాధించింది. కంపెనీ కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ 2023 డిసెంబర్‌లో 7,516 యూనిట్ల విక్రయాలతో మంచి లాభాలను అందించింది.


ఎస్‌యూవీ విభాగంలో అగ్రగామిగా ఉన్న మహీంద్రా బొలెరో 9.36 శాతం వృద్ధితో 7,995 యూనిట్లను విక్రయించింది. 5,793 యూనిట్ల అమ్మకాలతో మహీంద్రా థార్ 71.70 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది ఆన్ రోడ్ సౌకర్యం, ఆఫ్ రోడ్ సామర్ధ్యం రెండింటినీ అందించే లైఫ్ స్టైల్ ఎస్‌యూవీలపై కస్టమర్ల పెరుగుతున్న ఆసక్తిని చెబుతుంది.


వీటి అమ్మకాలు క్షీణించాయి
రెనో కిగర్‌కు సంబంధించి 865 యూనిట్ల అమ్మకాలు మాత్రమే సాధించింది. ఇది సంవత్సరానికి 58.73 శాతం క్షీణించింది. నిస్సాన్ మాగ్నైట్ 2,150 యూనిట్లు, మారుతి జిమ్నీ 730 యూనిట్లను విక్రయించాయి. కియా సోనెట్‌కు సంబంధించి కేవలం 10 యూనిట్లు అమ్ముడపోయాయి. దీంతో 2022 డిసెంబర్‌తో చూస్తే 99.83 శాతం భారీ క్షీణతను చూసింది. ఈ నెలలో కొత్త సోనెట్‌ను లాంచ్ చేయడం వల్ల ఈ తగ్గుదల ఏర్పడింది.


నవంబర్‌తో పోలిస్తే ఇలా...
టాటా నెక్సాన్ డిసెంబర్‌లో 15,284 యూనిట్లను విక్రయించింది. ఇది నవంబర్ కంటే 2.47 శాతం ఎక్కువ. అయితే నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో 13,787 యూనిట్ల అమ్మకాలతో టాటా పంచ్ 4.14 శాతం క్షీణతను నమోదు చేసింది. ఇది కాకుండా నవంబర్‌తో పోలిస్తే మారుతీ బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ కూడా వరుసగా 4.10 శాతం, 7.13 శాతం క్షీణతను ఎదుర్కొన్నాయి. 2023 నవంబర్‌తో పోలిస్తే 1.77 శాతం స్వల్ప క్షీణతతో మారుతి సుజుకి 9,692 యూనిట్లను విక్రయించగలిగింది. మహీంద్రా బొలెరో, మహీంద్రా థార్ వరుసగా 14.34 శాతం, 0.29 శాతం క్షీణతను చవిచూశాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వరుసగా 9.72 శాతం, 24.03 శాతం క్షీణించాయి. 2023 డిసెంబర్‌లో జిమ్నీ ధరను భారీగా తగ్గించినప్పటికీ 28.43 శాతం క్షీణతను చవిచూసింది.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!