The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్, మారుతిల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ది రాజా సాబ్’. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ‘ది రాజా సాబ్’ ఫస్ట్ లుక్‌ను చూస్తే ప్రభాస్ పేరులో మార్పును మీరే గమనించి ఉంటారు. ఇంగ్లిష్‌లో ప్రభాస్ స్పెల్లింగ్ సాధారణంగా PRABHAS అని వస్తుంది. కానీ ఈ పోస్టర్‌లో మాత్రం PRABHASS అని ఉంటుంది.
దర్శకుడు మారుతికి న్యూమరాలజీ మీద నమ్మకం ఎక్కువ. ఈ విషయాన్ని ఆయనే పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. మరి ఆ సలహా మేరకు ప్రభాస్ ఏమైనా పేరులో మార్పు చేశారేమో తెలియాల్సి ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ఇలా సరదా పాత్రలో చూసి చాలా కాలం అవుతుండటంతో ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్‌పై ఆశలతో ఉన్నారు.
‘ది రాజా సాబ్’ పోస్టర్‌లో టీ షర్ట్, పూల లుంగీతో ప్రభాస్ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రభాస్ హెయిర్‌స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే చాలా కొత్తగా ఉంది. కాస్త లాంగ్ హెయిర్‌తో ప్రభాస్ ఈ సినిమాలో కనిపిస్తున్నారు. డైరెక్టర్ మారుతి తన సినిమాల్లో హీరో లుక్ మీద చాలా కేర్ తీసుకుంటారు. ‘ది రాజా సాబ్’ పోస్టర్‌లో ఈ కేర్ స్పష్టంగా కనిపిస్తుంది. ‘ది రాజా సాబ్’లో నటిస్తున్న మిగతా నటీనటుల గురించి నిర్మాతలు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. మాళవికా మోహనన్ కొన్ని ఇంటర్వ్యూల్లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తాత లేదా విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.
సాంకేతిక నిపుణుల పేర్లు మాత్రం పోస్టర్‌లోనే అనౌన్స్ చేశారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ‘ది రాజా సాబ్’కు స్వరాలను సమకూరుస్తున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘ది రాజా సాబ్’ విడుదల తేదీని ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల అవుతుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘ది రాజా సాబ్’ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీని కంటే ముందు ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ప్రభాస్ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా 2024 మే 9వ తేదీన విడుదల కానుంది.