New Cars in 2024: కొత్త సంవత్సరం ప్రారంభంలో మారుతీ సుజుకి, హ్యుందాయ్, కియా, మహీంద్రా తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి. 2024 జనవరి 16వ తేదీన క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఇది కాకుండా కియా తన ఫేస్‌లిఫ్టెడ్ సోనెట్‌ను 2023 డిసెంబర్ 14వ తేదీన పరిచయం చేయబోతోంది. అయితే మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ లాంచ్ తేదీలను అధికారికంగా ధృవీకరించలేదు. ఇది 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత మహీంద్రా తన ఎక్స్‌యూవీ300 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అప్‌డేటెడ్ మోడళ్లను కూడా లాంచ్ చేయనుంది.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ మోటార్ ఇండియా జనవరి 16వ తేదీన కొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ని పరిచయం చేస్తుంది. ఈ ఎస్‌యూవీలో చాలా అప్‌డేట్స్ కనిపిస్తాయి. దీని డిజైన్ హ్యుందాయ్ గ్లోబల్ మోడల్ పాలిసాడ్ నుండి ప్రేరణ పొందింది. ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన కొత్త పెద్ద గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్ దాని ముందు భాగంలో కనిపిస్తుంది. ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లలో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), కొత్త ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 115 బీహెచ్‌పీ, 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లతో పాటు, కొత్త క్రెటా 160 బీహెచ్‌పీ, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో కూడా రానుంది.
కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్
కియా 2023 డిసెంబర్ 14వ తేదీన అప్‌డేట్ చేసిన సోనెట్‌ను లాంచ్ చేయనుంది. దీని రేట్లు మాత్రం 2024 జనవరిలో బయటికి రానున్నాయి. ఫేస్‌లిఫ్టెడ్ సోనెట్... కొత్త సెల్టోస్ లాంటి ఎల్ఈడీ లైట్ బార్, సీ-ఆకారపు టెయిల్‌ల్యాంప్‌లతో సహా లోపల, బయట అనేక మార్పులతో రానుంది. ఇంటీరియర్‌లో సెల్టోస్ వంటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏడీఏఎస్ టెక్నాలజీ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.
కొత్త తరం మారుతి స్విఫ్ట్
మారుతి సుజుకి తన కొత్త తరం స్విఫ్ట్‌ను 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభించవచ్చు. అప్‌డేట్ చేసిన ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన నాలుగో తరం స్విఫ్ట్ ఎక్కువ పొడవు, ఎత్తును కలిగి ఉంటుంది. ఏడీఏఎస్ సాంకేతికత భారతదేశ స్పెక్ వెర్షన్ ఫ్రంట్, బలెనో ఇన్‌స్పైర్డ్ ఇంటీరియర్ డిజైన్‌తో రానుందని తెలుస్తోంది. 2024 స్విఫ్ట్ కొత్త 1.2 లీటర్ 3 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న కే-సిరీస్ 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ కంటే ఎక్కువ మైలేజీని అందించగలదు.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్
2024 జనవరిలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ 131 బీహెచ్‌పీ, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఐసిన్ సోర్స్డ్ 6 స్పీడ్ ఆటోమేటిక్‌తో వస్తుంది. ఇది కాకుండా ఇప్పటికే ఉన్న 110 బీహెచ్‌పీ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ 117 బీహెచ్‌పీ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ పరిచయం కానుంది. దీని సెగ్మెంట్‌లో ఈ ఫీచర్‌తో వచ్చిన మొదటి కారు ఇదే. అంతేకాకుండా ఇందులో మరిన్ని ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!