Continues below advertisement


Bharat Taxi Service in India | న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భారతదేశపు మొట్టమొదటి సహకార టాక్సీ సర్వీస్ (cooperative cab service) అయిన భారత్ సేవను ప్రారంభించనుంది. ఓలా, ఊబర్ లాంటి క్యాబ్ సర్వీసులకు భారత్ ట్యాక్సీ సర్వీసు గట్టి పోటీని ఇవ్వనుంది. ఈ ప్రయత్నం ముఖ్య లక్ష్యం ఏంటంటే.. డ్రైవర్లకు వారి సంపాదనలో పూర్తి భాగాన్ని అందించడం. దీంతో పాటు ప్రయాణికులు ఇప్పుడు ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్ల కంటే ప్రభుత్వ పర్యవేక్షణలోని వాహనాల్లో ప్రయాణించే అవకాశాన్ని పొందుతారు.


గత కొన్ని సంవత్సరాలుగా యాప్ ఆధారిత టాక్సీ ప్లాట్‌ఫారమ్ సేవలపై ఎన్నో రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. పెరిగిన ఛార్జీల నుండి ఇష్టానుసారంగా రద్దు చేయడం వంటి అనేక సమస్యలు యూజర్లకు ఉన్నాయి. దీంతో పాటు డ్రైవర్లు ఎప్పటికప్పుడు కంపెనీలు వసూలు చేసే అధిక కమీషన్ రేట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీనివల్ల వారి కిరాయిల ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం వరకు నష్టం వస్తుంది. కనుక కోఆపరేటివ్ క్యాబ్ సర్వీస్ భారత్ ట్యాక్సీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు వారి సమస్యలన్నీ తొలగిపోనున్నాయి. 


ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 


భారత్ టాక్సీ పైలట్ ప్రాజెక్ట్ నవంబర్ నెలలో ఢిల్లీలో 650 కార్లతో ప్రారంభమవుతుంది. ఇది విజయవంతమైతే డిసెంబర్‌లో దీన్ని పూర్తిగా రోల్ అవుట్ చేస్తారు. ఢిల్లీ తర్వాత ఈ ట్యాక్సీ సేవ ఇతర ప్రధాన నగరాలకు విస్తరించాలని భావిస్తున్నారు.


టాక్సీ డ్రైవర్లు కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు


ఈ ట్యాక్సీ సర్వీస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత టాక్సీ డ్రైవర్లు తమ ప్రయాణాలపై ఎలాంటి కమీషన్ చెల్లించనక్కర్లేదు. ఇది వారికి అతిపెద్ద ప్రయోజనం. దీనికి బదులుగా వీరు సబ్‌స్క్రిప్షన్ ప్రాసెస్ కింద పని చేస్తారు. ఇందులో కొన్ని రోజువారీ, వారానికో లేదా నెలవారీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రకారం దీనివల్ల డ్రైవర్లు గతంలో కంటే ఎక్కువ సంపాదిస్తారు.



ప్రభుత్వం అనేక మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో భారత్ టాక్సీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ఈ ప్లాట్‌ఫారమ్‌లో 1 లక్షల మంది డ్రైవర్లు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. వీరిని జిల్లా ప్రధాన కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులు అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు.