అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడనుండగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తమైంది. తుపాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆమె విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షించారు. కోస్తా తీరం వెంబడి జిల్లాల్లో రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు, మంత్రులు, సెక్రటరీలు, ఐఏఎస్‌లు, కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం అంతా తుపానుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారని హోంమంత్రి అనిత వివరించారు. ఇప్పటికే మంత్రులు వారీగా శాఖలపై క్షేత్రస్థాయి అధికారుల వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సహాయక చర్యల కోసం ప్రభావం చూపే జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే మరిన్ని బృందాలను రంగంలోకి దించడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్న సందర్భంలో వినియోగించేందుకు వీలుగా శాటిలైట్ ఫోన్లను జిల్లాలకు పంపించారు.
కంట్రోల్ రూమ్ నెంబర్లు..1. APSDMA రాష్ట్ర కంట్రోల్ రూమ్ నెంబర్లు - 112, 1070, 1800 425 01012. శ్రీకాకుళం - 08942-2405573. విజయనగరం - 08922-2369474. విశాఖపట్నం - 0891-2590102/1005. అనకాపల్లి - 089242 228886. కాకినాడ - 0884-23568017. BR అంబేద్కర్ కోనసీమ- 08856-2931048. వెస్ట్ గోదావరి - 08816-2991819. కృష్ణుడు - 08672-25257210. బాపట్ల - 08643-22022611. ప్రకాశం - i/c 984976489612. నెల్లూరు - 0861-2331261, 799557669913. తిరుపతి - 0877-2236007
బీచ్‌లకు అనుమతించకూడదు
ప్రాణ నష్టం జరగకుండా చూడటం మనందరి బాధ్యత అని పునరుద్ఘాటించిన హోంమంత్రి అనిత, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక సూచనలు జారీ చేస్తూ, నదులు, సముద్ర తీరాల్లో అన్ని బోటింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని, బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులు కాలువలు, వాగులకు ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని సూచించారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున పట్టణాల్లో ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ను వెంటనే తొలగించాలని ఆమె ఆదేశించారు. సహాయ శిబిరాల (రిలీఫ్ క్యాంపులు) రూట్ మ్యాప్స్‌ను ముందే చూసుకోవాలని, రిలీఫ్ క్యాంపుల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే స్కూల్స్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కూడా వినియోగించుకోవాలని తెలిపారు.
స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు
హుదూద్ వంటి గత తుపాన్ల అనుభవంతో అదనపు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, మత్స్యకారుల బోట్లు, వలలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తుపానుపై వదంతులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సహాయం కావాలంటే స్టేట్ లేదా జిల్లాల కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 18004250101 లను ప్రజలు తప్పనిసరిగా సేవ్ చేసి పెట్టుకోవాలని, తుపాను జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని, అత్యవసరమైతే తప్ప రేపు, ఎల్లుండి బయటకు రావొద్దని కోరారు. మీ ఇళ్లు ప్రమాదకరంగా ఉంటే సురక్షిత ప్రాంతానికి వెళ్లండి అని సూచించారు. పీఆర్&ఆర్ డీ, ఇరిగేషన్, సివిల్ సప్లైస్, మెడికల్, విద్యుత్తు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అనిత ఆదేశించారు.