Solar Eclipse 2023: ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు ఖగోళ ప్రియులను కనువిందు చేయనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మరో రెండు చంద్రగ్రహణాలున్నాయి. తొలి సూర్యగ్రహణం ఈ నెల 20న ఏర్పడబోతున్నది. ఈ గ్రహణానికి ప్రత్యేకత ఉండగా.. దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు హైబ్రిడ్‌ సూర్యగ్రహణంగా పేర్కొంటున్నారు.


ఏప్రిల్ 20 సంపూర్ణ సూర్యగ్రహణం


శ్రీ శోభకృత్ నామసంవత్సరం చైత్రబహుళ అమావాస్య గురువారం ఏప్రిల్ 20న రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా, ఫసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం ప్రాంతాల్లో కనిపించనుంది. ఇండోనేషియాలో జకార్తా, మకాసార, మనక్ వాతీ, ఆష్ట్రేలియాలోని డార్విన్ ప్రాంతాల్లో కనిపించనుంది. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం వల్ల శాశ్వత అంధత్వానికి దారితీయొచ్చు. గ్రహణ సమయంలో భూమిపై చేరే కిరణాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఆ స‌మ‌యంలో మ‌నం గ్ర‌హ‌ణాన్ని చూసిన‌ప్పుడు అవి మన కళ్లకు హాని చేస్తాయి. కాబట్టి బైనాక్యూలర్లు లేదా టెలిస్కోప్, ఫిల్టర్ గ్లాసులు సహాయంతో వీక్షించాలి.


Also Read: గంగా పుష్కరాలకు కాశీ వెళుతున్నారా - టెంట్ సిటీలో రూమ్స్ ఇలా బుక్ చేసుకోండి


హైబ్రిడ్ సూర్య గ్రహణం 


ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడికి, భూమికి మధ్యన చంద్రుడు రావడంవల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది. శోభకృత్ నామసంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడుతున్నాయి..వాటిలో మొదటి ఏప్రిల్ 20న సూర్యగ్రహణం. ఈ గ్రహణాన్ని హైబ్రిడ్ గ్రహణం అని పిలుస్తున్నారు. హైబ్రిడ్ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడ్ని చంద్రుడు అడ్డుకుంటాడు. చంద్రుని నీడ భూమి ఉపరితలంపై కదులుతున్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం నుంచి కంకణాకార (రింగ్ ఆకారంలో)కి మారుతుంది. దీనినే హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటారు. 2023లో తదుపరి సూర్యగ్రహణం అక్టోబర్ 14న వచ్చింది.


ఈ గ్రహణాన్ని  అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఆస్ట్రేలియాలోని గ్రావిటీ డిస్కవరీ సెంటర్ అండ్ అబ్జర్వేటరీ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అయితే, ఈ అరుదైన సూర్యగ్రహణంలో ప్రపంచంలోని నాలుగు లక్షల మంది కంటే తక్కువ మంది, సంపూర్ణ గ్రహణం లేదంటే.. కంకణాకార గ్రహణాన్ని చూడగలుగుతారని శాస్త్రవేత్తలు చెప్పారు. దాదాపు 700 మిలియన్ల మంది పాక్షిక సూర్యగ్రహణాన్ని చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం ఆస్ట్రేలియా ఎక్స్‌మౌత్‌ ద్వీపకల్పంలో కేవలం ఒకే ఒక నిమిషం మాత్రమే కనిపిస్తుందని చెబుతున్నారు.


నాలుగు రకాల సూర్యగ్రహణాలు



  • సంపూర్ణ సూర్యగ్రహణం

  • పాక్షిక సూర్యగ్రహణం

  • సంకర సూర్యగ్రహణం

  • కంకణాకార సూర్య గ్రహణం


Also Read: గంగా పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, పుష్కరాలు ఎలా ప్రారంభమయ్యాయి!


భారతదేశంలో కనిపించకపోయినా నియమాలు పాటించాలా


భారత దేశంలో ఈ సూర్య గ్రహణం కనిపించదు కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభకార్యాలపై ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్యశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే గ్రహణం ఏర్పడటానికి ముందు నుంచి గ్రహణం ముగిసే వరకు ఉన్న సమయాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు.ఒకవేళ కాదని శుభకార్యాలు జరిపిస్తే అశుభ ఫలితాలు వస్తాయని విశ్వసిస్తారు. మనదేశంలో కనిపించదు కాబట్టి నియమాలు మాత్రం పాటించాల్సిన అవసరం లేదంటున్నారు.