సంచలనంగా మారుతున్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ నెక్స్ట్‌ స్టెప్ ఏంటని చాలా మంది ఆలోచిస్తున్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఇవాళ విచారణకు పిలిచిన దర్యాప్తు సంస్థ ఎలా విచారించనుందనేది సస్పెన్స్‌గా మారింది. 


ఈ నెల 25 వరకు ఆయన్ని రోజూ విచారించవచ్చని చెప్పిన తెలంగాణ హైకోర్టు... అరెస్టు మాత్రం చేయొద్దని ఆదేశించింది. ఈ విషయంలో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. తీర్పు ప్రకారం విచారిస్తుందా లేకుంటే పై కోర్టుకు అప్పీల్‌కు వెళ్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 


మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పలు దఫాల విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డిని ఇవాళ మరోసారి దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ను కూడా కస్టడీలోకి తీసుకోనున్నారు. వీళ్లందర్నీ కలిపి విచారిస్తారా లేకుంటే విడివిడిగానే విచారిస్తారా అనేది తేలాల్సి ఉంది. 


వీళ్ల ముగ్గురిపై తీవ్ర ఆరోపణలు చేసిన సీబీఐ ఇకపై ఎలా ముందుకు వెళ్తుందనే ఆసక్తి నెలకొంది. అసలు కేసును తప్పుదారి పట్టించడంలో వీళ్ల పాత్ర చాలా కీలకమని సీబీఐ కోర్టులో వాదిస్తూనే ఉంది. హత్యకు కుట్ర చేయడం, ఆధారాలు చేరిపేయడం, గుండెపోటని ప్రచారం చేయడానికి ప్రయత్నించారని కూడా సీబీఐ అభియోగాలు మోపింది. ఇవి ఆరోపణలు కావాని దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొంది. 


ఇంతలా ఆరోపణలు చేసిన సీబీఐ ఇప్పటి వరకు దొరికిన లీడ్స్ పట్టుకొని ముగ్గర్ని కలిపి విచారిస్తుందా లేకుండా విడివిడిగా విచారించనుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ ఉదయం పదిన్నరకు అవినాష్ రెడ్డి విచారణ ప్రారంభం కానుంది. అదే టైంలో భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిని కూడా అక్కడు తీసుకురానున్నారు. వీళ్లిద్దర్ని ఆరు రోజుల కస్టడీకి ఇస్తూ ఇప్పటికే కోర్టు తీర్పు ఇచ్చింది. అందుకే ఈ ఆరు రోజుల పాటు ముగ్గుర్ని కలిపి విచారిస్తారని... ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాలతో వారి చెప్పేది సరిపోల్చుకుంటారని మాజీ సీబీఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 


నేటి నుంచి చంచల్ గూడ జైలులో భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈనెల 19 నుంచి 24 తేదీ వరకు అనుమతి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. ఆరు రోజుల పాటు కస్టడీలో వీరిద్దరి నుంచి కీలకమైన వివరాలను సీబీఐ అధికారులు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.   సీబీఐకి ఇప్పటి వరకూ దొరికిన ఆధారాలను చూపిస్తూ వారిని ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


ఏప్రిల్ 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని CBIని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి అరెస్టు తర్వాత నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ సోమవారం విచారణకు రావాలని ఆయన కుమారుడు, వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. దీనిపై అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు అరెస్టు చేయవద్దని ఉత్తర్వులు ఇచ్చింది.