Significance Apara Ekadashi:  ఏకాదశి తిథి హిందువులకు చాలా ప్రత్యేకం. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ తిథిరోజు ఉపవాసం మర్నాడు ద్వాదశి రోజు ప్రత్యేక పూజచేసి దాన ధర్మాలు చేసి ఉపవాసం విరమిస్తారు. నెలకు 2 ఏకాదశిలు చొప్పున ఏడాది పొడవునా 24 ఏకాదశిలు వస్తాయి..దేనికదే ప్రత్యేకం. అయితే వైశాఖమాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ ఏడాది జూన్ 2న ఏకాదశి తిథి ఉంది... ఈ రోజు ఉపవాసం ఉండి జూన్ 3 ద్వాదశి రోజు ఉపవాసం విరమిస్తారు. 


అపర ఏకాదశి  ప్రాముఖ్యత


అపర ఏకాదశిరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని హిందువుల విశ్వాసం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. ఈ రోజు పూజ చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత పూజామందిరాన్ని శుభ్రంచేసి దీపం వెలిగించండి. శ్రీమహావిష్ణువు పూజలో తులసిని తప్పనిసరిగా చేర్చాలి. ఈ రోజు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవితో పాటూ తులసిని కూడా పూజిస్తారు.  


Also Read: జూన్ 1 శనివారం హనుమాన్ జయంతి - తిరుమల, కొండగట్టులో ప్రత్యేక ఏర్పాట్లు!


ఉపవాసం ఆరోగ్యం


ఉరకల పరుగుల జీవనంలో ఆరోగ్యంపై శ్రద్ద తగ్గిపోతోంది. అందుకే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే 15 రోజులకు ఓసారి ఉపవాసం ఉండడం వల్ల జీర్ణవ్యవస్థలో ఉండే సమస్యలు తీరిపోతాయి. రోజంతా ఉపవాసంతో పాటూ భగన్నామస్మరణ చేయడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. 15 రోజులకోసారి ఉపవాసం, జాగరణ, భగన్నామస్మరణతో సాగే అద్భుతమైన తిథి ఏకాదశి. అందుకే ఏడాది పొడవునా వచ్చే ఏకాదశిలకు ఒక్కో తిథికి ఒక్కో పేరు పెట్టారు...ఒక్కో విశిష్టత ఉందని వివరించారు. 


ఇదే రోజు భద్రకాళి జయంతి


ఉత్తరాది రాష్ట్రాల్లో అపర ఏకాదశిని భద్రకాళి జయంతిగా జరుపుతారు. దక్షయజ్ఞం సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్టసంహారం చేసే ఈ భద్రకాళి రాక్షసులకు ఉగ్రరూపిణి అయినా భక్తులపట్ల శాంతమూర్తే. భద్రకాళి కూడా ఇదే రోజు అవతరించిందని చెబుతారు. అందుకే భద్రకాళి పూజ చేస్తారు. ఒడిషాలో జలకృద ఏకాదశి పేరుతో జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. మిగిలిన ప్రాంతాల్లోనూ వివిధ రకాల పేర్లతో శ్రీ మహావిష్ణువు ఆరాధన జరుగుతుంది.


Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది! 


మాయా పొరను తొలించడమే


అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని అర్థం...ఈ అపర ఏకాదశి రోజు భగవంతుడిపై మనసు లగ్నం చేయడం ద్వారా మిమ్మల్ని కమ్మిన మాయాపొరకూడా తొలగిపోతుందంటారు. ఈ ఏకాదశి గురించి శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో ఏం చెప్పాడంటే... ‘అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే … గొడ్డలితో చెట్టుని నరికినట్టుగా, అగ్ని అడవిని దహించేసినట్టుగా, సూర్యుడు చీకటిని చీల్చినట్టుగా పాపాలన్నీ పటాపంచలైపోతాయని చెప్పాడు. అపర ఏకాదశి రోజున వామనావతరంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. 


ఉపవాస నియమం


అపర ఏకాదశి రోజు ఉపవాసం పాటించాలి అనుకుంటే దశమి రోజు సాయంత్రం నుంచి నియమాలు పాటించాలి.  ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం లేకపోయినా బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు. రాత్రంతా జాగరణ చేసి ద్వాదశి ఘడియలు ప్రారంభమయ్యాక ఉపవాసం విరమించాలి. ఏకాదశి రోజు సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణం చేయడం అత్యంత శుభప్రదం.