Heavy Rains In Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం వైఫల్యం కారణంగానే, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలు, తుఫాను గురించి సీఎం చంద్రబాబు (AP CM Chandrababu)కు ముందే తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగానే రాష్ట్రంలో ప్రాణనష్టం సంభవించిందని ఆరోపిస్తూ వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలను పట్టించుకుని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే, ఏపీలో ప్రాణ నష్టం ఉండేది కాదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.


వర్షాల గురించి తెలిసినా చంద్రబాబు పట్టించుకోలేదు 
‘రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు చంద్రబాబుకు ముందే  తెలుసు. తుఫాను వల్ల ఏఏ జిల్లాలో ఎంత వర్షపాతం కురుస్తుందో కూడా వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. అయినా చంద్రబాబు సర్కార్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాని ఫలితమే 10 మందికి పైగా చనిపోవడానికి, విజయవాడ మునిగిపోవడానికి కారణం. రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తున్నా ప్రభుత్వం యంత్రాంగం ఎలాంటి ముందస్తు  చర్యలు తీసుకోకపోవడం దారుణం.


రాజకీయాల్లో తాను చాలా సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు.. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోగా జరగాల్సిన నష్టం అంతా జరిగాక ఇప్పుడు తగుదునమ్మా అంటూ బోటులో షికార్లు చేస్తున్నాడు. చంద్రబాబు పర్యటన దృశ్యాల‌ను ఎల్లోమీడియా జాకీలు పెట్టి లేపుతోంది. మ‌న రాష్ట్రానికి ఇలాంటి ముఖ్య‌మంత్రి ఉండ‌డం రాష్ట్ర  ప్ర‌జ‌ల దౌర్భాగ్యం’ అని వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.


Also Read: వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ నుంచి ఖమ్మం- విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్‌ లు ఇవే






ఏపీకి సాయం చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు


రాష్ట్రానికి కావాల్సిన సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం పెద్దలతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఏపీకి స్పీడ్ బోట్లు, హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. విజయవాడలో జరిగిన ఘటనపై కేంద్రానికి వివరించారు. స్వయంగా రంగంలోకి దిగి, వరద పరిస్థితిని సమీక్షించినట్లు ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తోందని, ఔట్ ఫ్లో సైతం అదే స్థాయిలో ఉందని, సమీప ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


Also Read: ఏపీకి 40 పవర్ బోట్లు, 10 NDRF టీమ్స్, 10 హెలికాప్టర్లు - కేంద్రం సాయంపై సీఎం చంద్రబాబు